కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి.. ఆన్ లైన్‌లో ఆశీర్వాదం

చెన్నై: కరోనా వైరస్ కార‌ణంగా ప్ర‌పంచంలో చాలా దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. దీంతో ‌ ప్ర‌తీ ఏడాది ఎక్కువ‌గా వేస‌వి రోజుల్లో జ‌రిగే పెళ్లిళ్లు, శుభ‌కార్యాలు ఈ సారి మాత్రం లాక్ డౌన్ వ‌ల్ల‌ వాయిదా పడ్డాయి. ప్ర‌భుత్వాలు సామాజిక దూరం పాటించాల‌నే నిబంధ‌న పెట్ట‌డంతో చాలామంది కేవ‌లం ఇరు కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. మ‌రి కొంత‌మంది మాత్రం ఆన్ లైన్‌లో వీడియో కాల్ ద్వారా అనుకున్న ముహుర్తానికే వివాహాలు జ‌రుపుకుంటున్నారు.

త‌మిళ‌నాడుకు చెందిన ఓ జంట కూడా ఇలాగే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలోనే పెళ్లి చేసుకొని.. ఆన్ లైన్ లో పెద్దల‌ ఆశీర్వాదంతో ఒక్కటయ్యింది. చెన్నై కి చెందిన‌ చంద్ర పాండియన్, వింబా లు బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నారు. వీరికి గతంలో వివాహం నిశ్చయమైంది. పెళ్ళి అట్టహాసంగా చేసుకోవాలని ఇరు కుటుంబాల పెద్దలు అనుకున్నారు. అయితే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ప్ర‌భుత్వ ఆదేశాల ప్ర‌కారం నిరాడంబ‌రంగానే చేసుకోవాలని నిర్ణయించారు. తంజావూరు సమీపంలోని పిల్లయార్పట్టిలోని పెళ్ళి కుమార్తె వింబా ఇంటి దగ్గర వివాహం అతి తక్కువ మంది కుటుంబ సభ్యుల మద్య జరిగింది. అయితే ద్ర‌విడ కుటుంబాల‌కు చెందిన వీరి పెళ్లిళ్ల‌కు పెద్దల ఆశీర్వాదం కంప‌ల్స‌రీ. వ‌రుడి త‌ర‌పు బంధువులు, పెద్ద‌లంతా చెన్నైలో ఉండిపోవ‌డంతో ‌ వారంతా పెళ్లిని వీక్షించేందుకు.. ద్రవిడ కరగం ద్రవిడ పార్టీ అద్యక్షులు వీరమణి… చెన్నై నుండి జూమ్ యాప్ ఏర్పాటు చేసి పెళ్లి కార్యక్ర‌మాన్ని చూపించారు. దీంతో బంధువులంద‌రూ జూమ్ యాప్ లోనే ఎక్కడివారు అక్కడి నుండే తిలకించి చప్పట్లతో నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Latest Updates