అమ్మాయిలకు మార్షల్​ ఆర్ట్స్​ నేర్పాలె

గవర్నర్​ తమిళిసై సూచన
స్టూడెంట్లకు కలరిపయట్టు నేర్పడంపై ప్రశంసలు
పెద్దపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన
నంది పంప్హౌస్ సందర్శన

పాలకుర్తి మండలంలోని కన్నాల గ్రామంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కలను పరిశీలించిన గవర్నర్​ తాను కూడా మొక్కలు నాటారు. ధర్మారం ఎక్స్​ రోడ్డులో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్​ బ్యాగుల తయారీ కేంద్రాన్ని, పెద్దపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సబల శానిటరీ న్యాప్​కిన్స్​ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ నుంచి పెద్దపల్లి మండలంలోని కాసులపల్లి చేరుకున్నారు. అక్కడి నుంచి ధర్మారం మండలంలోని నంది మేడారం చేరుకుని కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భాగంగా నంది మేడారంలో నిర్మించిన నంది పంప్​హౌస్​​ను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం తర్వాత హైదరాబాద్​ బయలుదేరారు.

పెద్దపల్లి, వెలుగుప్రస్తుతం సమాజంలో ప్రతి అమ్మాయికీ ఆత్మరక్షణ చాలా అవసరమని, అందుకోసం వారికి ప్రాచీన యుద్ధ కళలను నేర్పితే జీవితంలో ఉపయోగపడతాయని గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో బాలికల ఆత్మరక్షణ కోసం కేరళ సంప్రదాయ యుద్ధ విద్య కలరిపయట్టు నేర్పుతున్నారని, ఇలాంటి విద్య రాష్ట్రంలోనే కాక దేశంలోని ప్రతి బాలికకు అవసరమని చెప్పారు. ఆత్మరక్షణ కోసం కరాటే, కుంగ్​ఫూ వంటి విదేశీ మార్షల్​ ఆర్ట్ ఉన్నప్పటికీ కలరిపయట్టును స్టూడెంట్లకు నేర్పిస్తున్న జిల్లా కలెక్టర్​ శ్రీదేవసేన, ట్రైనర్ శివను గవర్నర్​ అభినందించారు. జయశంకర్​ భూపాలపల్లి జిల్లా పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి రామగుండంలో ఎన్టీపీసీ గెస్ట్​హౌస్​లో బస చేసిన గవర్నర్​ దంపతులు బుధవారం పెద్దపల్లి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు.

పిల్లలకు పిజ్జా, బర్గర్లు వద్దు

పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు కలరిపయట్టుపై ఇస్తున్న శిక్షణను గవర్నర్​ దంపతులు తిలకించారు. ఈ సందర్భంగా తమిళిసై మాట్లాడుతూ.. ఆత్మరక్షణ కోసం స్టూడెంట్లకు ప్రాచీన యుద్ధ కళలను నేర్పించడం వారికి జీవితంలో ఉపయోగపడుతుందన్నారు. అమ్మాయిలకు ఇతర స్వదేశీ కళలను కూడా నేర్పించాలని, స్వదేశీ కళలను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో శిక్షణ తీసుకుంటున్న బాలికలు మిగిలిన వారిని ఈ దిశగా ప్రోత్సాహించాలన్నారు. యోగాకు ప్రపంచ గుర్తింపు వచ్చేలా ప్రధాని మోడీ కృషి చేశారని, జూన్​21ని ప్రపంచ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారని గవర్నర్​ గుర్తుచేశారు. చాలా మంది పిల్లలకు టిఫిన్​ బాక్స్​ ల్లో పిజ్జాలు, బర్గర్లు పెడుతున్నారని, వాటిని వాడొద్దని, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లులందరూ పోషకాహారం అందించాలని గవర్నర్​సూచించారు. పిల్లలకు న్యూట్రిషియన్​ ఫుడ్​ అందించాలని మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. గవర్నర్​ వెంట జిల్లా కలెక్టర్​ శ్రీదేవసేన, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, గవర్నర్​ సెక్రెటరీ సురేంద్ర మోహన్, రామగుండం ఎన్టీపీసీ ఈడీ కులకర్ణి తదితరులు ఉన్నారు.

Latest Updates