పద్మభూషణ్ సింధు

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌‌లో సంచలనాలు సృష్టించిన తెలుగుతేజం పూసర్ల వెంకట సింధును.. కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. రిపబ్లిక్‌‌ డేను పురస్కరించుకుని శనివారం ప్రకటించిన పద్మ పురస్కారాల్లో సింధుకు.. ప్రతిష్టాత్మక ‘పద్మ భూషణ్‌‌’ లభించింది. 2016 రియో ఒలింపిక్స్‌‌లో రజత పతకం గెలిచిన 24 ఏళ్ల సింధు.. వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన తొలి ఇండియన్‌‌ బ్యాడ్మింటన్‌‌ ప్లేయర్‌‌గానూ రికార్డులకెక్కింది. ఓవరాల్‌‌గా వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో సింధు.. గోల్డ్, రెండు సిల్వర్‌‌, రెండు బ్రాంజ్‌‌ మెడల్స్‌‌ను సాధించింది. బాక్సింగ్‌‌ స్టార్‌‌ ఎంసీ మేరీకోమ్‌‌కు.. రెండో అత్యున్నత పురస్కారం ‘పద్మ విభూషణ్‌‌’ దక్కింది. 2012 లండన్‌‌ ఒలింపిక్స్‌‌లో బ్రాంజ్‌‌ మెడల్‌‌ గెలిచిన మేరీ… అత్యద్భుతమైన తన కెరీర్‌‌లో ఆరుసార్లు వరల్డ్‌‌ చాంపియన్‌‌గా నిలిచింది. రాజ్యసభ ఎంపీగా పని చేస్తున్న ఈ మణిపూర్‌‌ బాక్సర్‌‌..  ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌‌ క్వాలిఫయర్స్‌‌ కోసం సిద్ధమవుతున్నది. ఇక కేంద్రం మరో ఆరుగురికి పద్మ శ్రీ అవార్డులను ప్రకటించింది. జహీర్‌‌ ఖాన్‌‌ (క్రికెట్‌‌), ఒమమ్‌‌ బెంబేమ్‌‌ దేవి (ఫుట్‌‌బాల్‌‌), ఎంపీ గణేశ్‌‌ (హాకీ), రాణి రాంపాల్‌‌ (హాకీ), జీతూ రాయ్‌‌ (షూటింగ్‌‌), తరుణ్‌‌ దీప్‌‌ రాయ్‌‌ (ఆర్చరీ) ఇందులో ఉన్నారు.

దేశం మెచ్చిన సింధూరం

తన ఆటతో ఎన్నో పతకాలు కొల్లగొట్టి.. మరెన్నో రికార్డులను బద్దలు కొట్టి.. ఇండియా బ్యాడ్మింటన్‌‌‌‌ హిస్టరీలో మరెవరూ సాధించని ఘనతలు సొంతం చేసుకున్న తెలుగమ్మాయి పీవీ సింధు అవార్డుల్లోనూ తనకు ఎదురులేదని నిరూపించుకుంది. బ్యాడ్మింటన్‌‌‌‌ అపర ద్రోణుడు పుల్లెల గోపీచంద్‌‌‌‌ మార్గనిర్దేశంలో 2009లో ఇంటర్నేషనల్‌‌‌‌ బ్యాడ్మింటన్‌‌‌‌లోకి అడుగుపెట్టి.. అనతికాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిన సింధు దేశ క్రీడారంగంలోనే  మేటి అథ్లెట్‌‌‌‌గా ఎదిగింది. 2010లో ఇరాన్‌‌‌‌ ఫజర్‌‌‌‌ టోర్నీలో విజేతగా నిలిచి తొలి  బీడబ్ల్యూఎఫ్‌‌‌‌  (ఇంటర్నేషనల్‌‌‌‌ చాలెంజ్‌‌‌‌) టైటిల్‌‌‌‌ నెగ్గినప్పటి నుంచి తెలుగమ్మాయి వెనుదిరిగి చూసింది లేదు. 2012లో సయ్యద్‌‌‌‌ మోదీ ఇంటర్నేషనల్‌‌‌‌ టోర్నీతో  బీడబ్లూఎఫ్‌‌‌‌ గ్రాండ్‌‌‌‌ ప్రి టైటిళ్ల వేట కూడా మొదలు పెట్టిన హైదరాబాదీ ఆ తర్వాత జెట్‌‌‌‌ స్పీడును అందుకుంది.  సింధు టాలెంట్‌‌‌‌ను గుర్తించిన కేంద్ర క్రీడా శాఖ 2013లోనే ఆమెకు అర్జున అవార్డు అందించింది. ఇక, మకావు ఓపెన్‌‌‌‌ (2013, 14, 15)లో హ్యాట్రిక్‌‌‌‌ టైటిళ్లతో అదరగొట్టిన గోపీచంద్‌‌‌‌ శిష్యురాలు బ్యాడ్మింటన్‌‌‌‌ ప్రపంచం తన గురించి మాట్లాడుకునేలా చేసింది. అయితే,  చైనా, కొరియా, జపాన్‌‌‌‌ షట్లర్ల హవాతో పాటు ఇండియా నుంచి సైనా నెహ్వాల్‌‌‌‌ రూపంలో అప్పటికే ఓ సూపర్‌‌‌‌ స్టార్‌‌‌‌ ఉండడంతో 2016 వరకూ సింధుకు తగిన గుర్తింపు రాలేదని చెప్పాలి. అప్పటిదాకా సైనా తర్వాత తాను అనేలా ఉన్న సింధు ఆ ఏడాది ఒలింపిక్స్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో పెను సంచలనాన్నే సృష్టించింది. మేటి స్టార్లు అందరూ  ఒట్టి చేతులతో వెనక్కు వస్తుండగా.. అసలు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సింధు రజతంతో ఇండియా పరువు కాపాడింది. అదే ఏడాది ఆమెను దేశ క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్‌‌‌‌ ఖేల్‌‌‌‌రత్న కూడా వరించింది. ఒలింపిక్స్‌‌‌‌ తర్వాత సింధు పేరు దేశం మొత్తం మారుమోగింది. సైనా రాకతో దేశంలో బ్యాడ్మింటన్‌‌‌‌కు క్రేజ్‌‌‌‌ వస్తే దాన్ని సింధు పీక్​ స్టేజ్‌‌‌‌కు తీసుకెళ్లింది. ఒలింపిక్స్‌‌‌‌  తర్వాత స్టార్‌‌‌‌డమ్‌‌‌‌తో పాటు లెక్కలేనన్ని ఎండార్స్‌‌‌‌మెంట్స్‌‌‌‌తో సింధు క్షణం తీరిక లేకుండా మారింది. అయితే, చిన్న వయసులోనే ఎంతో స్టార్‌‌‌‌డమ్‌‌‌‌ వచ్చినా.. సింధు ఆటను ఏనాడూ  నిర్లక్ష్యం చేయలేదు.  ఆమె సక్సెస్​కు కారణం అదే. కలలో కూడా ఊహించని కీర్తిని అందుకున్నా… ఇక చాలు అని ఎప్పుడూ అనుకోలేదామె. ప్రతి రోజు మొదటి రోజులా ప్రాక్టీస్‌‌‌‌ చేసింది. తన నైపుణ్యాలను పెంచుకుంది. ఒలింపిక్స్‌‌‌‌ తర్వాత   పలు మేజర్‌‌‌‌ టోర్నీల్లో ఫైనల్‌‌‌‌ వరకూ వచ్చి టైటిల్‌‌‌‌ చేజారుతున్న టైమ్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఫోబియా పట్టుకుందన్న విమర్శలకు తన రాకెట్‌‌‌‌తోనే సమా ధానం చెబుతూ… 2018లో బీడబ్ల్యూఎఫ్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ టూర్‌‌‌‌ ఫైనల్స్‌‌‌‌ టైటిల్‌‌‌‌ అందుకుంది. అలాగే, మూడేళ్లుగా తనను ఊరిస్తున్న వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ను గతేడాది కైవసం చేసుకొని సగర్వంగా తలెత్తుకుంది. ఇన్ని ఘనతలు సాధించిన సింధు పద్మ భూషణ్‌‌‌‌కు పూర్తిగా  అర్హురాలు. వాస్తవానికి 2018లోనే ఆమెకు ఈ అవార్డు రావాల్సింది. అప్పుడే ఆమె పేరును స్పోర్ట్స్‌‌‌‌ మినిస్ట్రీ సిఫారసు చేసింది. కానీ, పంకజ్‌‌‌‌ అద్వానీ, మహేంద్ర సింగ్‌‌‌‌ ధోనీ పోటీలో ఉండడంతో తెలుగమ్మాయికి నిరాశే ఎదురైంది. కానీ, ఈ సారి సింధును విస్మరించడానికి అవకాశమే లేకుండా పోయింది. –(వెలుగు క్రీడా విభాగం)

 

Latest Updates