మేరీ రికార్డు పంచ్‌

 

  •                 వరల్డ్‌ బాక్సింగ్‌లో ఎనిమిదో మెడల్‌ ఖాయం
  •                 సెమీస్‌ చేరిన మేరీకోమ్‌
  •                 రాణి, జమున, లవ్లీనా కూడా

ఇండియా లెజెండరీ బాక్సర్‌‌ మేరీకోమ్‌‌ వరల్డ్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో తన రికార్డును మరింత మెరుగు పరుచుకుంది. ఆరు సార్లు వరల్డ్​ చాంపియన్​ అయిన మేరీ (51కేజీ).. ఈ మెగా టోర్నీలో ఎనిమిదో మెడల్‌‌ను ఖాయం చేసుకొని ఈ ఘనత సాధించిన తొలి బాక్సర్‌‌గా చరిత్ర సృష్టించింది. ఆమెతో పాటు మంజు రాణి (48కేజీ), జమునా బోరొ (54కేజీ)తో పాటు గత ఎడిషన్‌‌ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గొహైన్‌‌ (69కేజీ) కూడా సెమీస్​ చేరి ఇండియాకు   4 మెడల్స్​ ఖాయం చేశారు. గురువారం జరిగిన క్వార్టర్‌‌ఫైనల్‌‌ బౌట్‌‌లో మూడో సీడ్‌‌ మేరీకోమ్‌‌ 5–0తో కొలంబియా బాక్సర్‌‌ వాలెన్సియా విక్టోరియాను చిత్తుగా ఓడించింది. తన ఎక్స్‌‌పీరియన్స్‌‌ను ఉపయోగించిన మేరీ ఈ బౌట్‌‌లో తెలివిగా ఆడింది. ప్రత్యర్థి ఆరంభం నుంచే అటాక్‌‌ చేసినా.. పటిష్ట డిఫెన్స్‌‌తో ఆమె పంచ్‌‌లు కనెక్ట్‌‌ కాకుండా చూసుకుంది. అదే టైమ్‌‌లో తనకు చాన్స్‌‌ వచ్చే వరకూ వేచి చూసి కచ్చితమైన పంచ్‌‌లు విసిరింది. రైట్​ హ్యాండ్‌‌తో పక్కాగా హుక్స్‌‌ కొడుతూ పాయింట్లు రాబట్టింది. అలాగే, ఆమె విసిరిన స్ట్రైట్​ పంచ్‌‌లు కూడా వాలెన్సియాకు బలంగా తగిలాయి. దాంతో, ఐదుగురు జడ్జీలు మేరీని విజేతగా ప్రకటించారు. ఈ మెడల్‌‌తో వరల్డ్‌‌ బాక్సింగ్‌‌లో మోస్ట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ బాక్సర్‌‌గా తన రికార్డును మేరీ మరింత మెరుగు పరుచుకుంది. మెడల్స్‌‌ పరంగా కూడా (పురుషులు, మహిళల్లో కలిపి) టాప్‌‌ ప్లేస్‌‌ సాధించడం విశేషం. పురుషుల ఈవెంట్‌‌లో ఏడు మెడల్స్‌‌ (6 గోల్డ్‌‌, 1 సిల్వర్‌‌) గెలిచిన క్యూబా లెజెండ్‌‌ ఫెలిక్స్‌‌ సావోన్‌‌ను అధిగమించింది. శనివారం జరిగే సెమీస్‌‌లో రెండో సీడ్‌‌ బుసెనాజ్‌‌ కాకిరొగ్లు (టర్కీ)తో మేరీకోమ్‌‌ పోటీ పడనుంది.

టాప్‌‌ సీడ్‌‌కు రాణి షాక్‌‌

వరల్డ్‌‌ బాక్సింగ్‌‌లో తొలిసారి పోటీ పడుతున్న మంజు రాణి సంచలన పెర్ఫామెన్స్‌‌ చేసింది. ఆరోసీడ్‌‌గా బరిలోకి దిగిన రాణి క్వార్టర్స్​లో 4–1తో టాప్‌‌ సీడ్‌‌, గత ఎడిషన్‌‌ కాంస్య విజేత కిమ్‌‌ హ్యాంగ్‌‌ మి (సౌత్‌‌ కొరియా)ను ఓడించి ఔరా అనిపించింది. జమున బోరొ కూడా 4–1జర్మనీ బాక్సర్‌‌ ఉర్సులా గొట్లాబ్‌‌ను ఓడించింది. 69కేజీ క్వార్టర్స్‌‌ బౌట్‌‌లో మూడో సీడ్‌‌ బొర్గొహైన్‌‌ 4–1తో ఆరోసీడ్‌‌ కరోలినా కొస్జెవ్‌‌స్కా (పోలాండ్‌‌)పై విజయం సాధించి వరుసగా రెండో ఎడిషన్‌‌లో సెమీస్‌‌ చేరింది. అయితే, కవితా చహల్‌‌ (+81 కేజీ) 0–5తో బెలారస్‌‌కు చెందిన కత్సియర్న కవలేవ చేతిలో ఓడి నిరాశ పరిచింది.

 

Latest Updates