ముద్దులను అడ్డుకోలేకపోయిన ‘వైరస్’!

masks-and-kisses-philippine-couples-brave-coronavirus-to-exchange-vows

భారీ సంఖ్యలో ఉన్న యువ జంటలు ముద్దు పెట్టుకుంటున్న ఈ ఫొటో చూస్తే అయ్యో పాపం అనిపిస్తుందేమో! విదేశాల్లో క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగే పెళ్లిళ్లు అనగానే గుర్తొచ్చేవి.. వధూవరులు తెల్లటి దుస్తుల్లో మెరిసిపోవడం.. చర్చిలో ఫాదర్ ముందు ఒకరిపై మరొకరి ఇష్టాన్ని వ్యక్తపరచడం.. రింగులు మార్చుకున్న తర్వాత చివరిలో ఆ జంట ఫ్రెంచ్ కిస్!! కానీ, ప్రస్తుతం కరోనా దెబ్బకి ఒకరినొకరు తాకడానికే భయపడుతున్న పరిస్థితి ఉన్న చోటది. అయితేనేం పెళ్లి చివరలో ముద్దు పెట్టి.. తమ ప్రేమను తెలిపే సంప్రదాయాన్ని ప్రాణాంతక వైరస్ కూడా అడ్డుకోలేకపోయింది. వీరి ప్రేమ.. మాస్కుల సాయంతో  ఆ భయాన్ని కూడా జయించింది. ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఓ సామూహిక వివాహాల వేడుకలో ప్రేమ జంటలు ఇలా మాస్కులతో ముద్దు పెట్టుకున్నారు.

కరోనా భయంలోనూ కదిలి వచ్చిన ప్రేమ జంటలు

ప్రేమికుల దినోత్సవం జరిగిన వారం తర్వాత ఫిలిప్పీన్స్‌లోని బకొలోడ్ సిటీలో ప్రతి ఏటా సంప్రదాయంగా సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. ప్రేమ జంటలను భారీ సంఖ్యలో ఒక చోటకి చేర్చి పెళ్లిళ్లు అక్కడి ప్రభుత్వమే చేస్తుంది. ఓ వైపు కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ… వెనకడుగు వేయకుండా ఆ ఈవెంట్‌ను ఈ ఏడాది కూడా గ్రాండ్‌గా నిర్వహించారు. సిటీ మేయర్ ఎవెలియో లియోనార్డియా ఆధ్వర్యంలో 220 జంటలకు పెళ్లి చేశారు. గురవారం నాడు సిటీ హాల్‌లో జరిగింది ఈ సామూహిక వివాహ వేడుక. ప్రేమికులు, వాళ్ల బంధువులతో సిటీ హాల్ నిండిపోయింది.

వెరైటీ కిస్

కరోనా భయంతో వచ్చిన ప్రతి ఒక్కరికీ మాస్క్ తప్పనిసరి చేశారు అధికారులు. దీంతో వైట్ కోట్, వైట్ గౌన్లలో ఉన్న జంటలంతా గ్రీన్ కలర్ సర్జీకల్ మాస్క్‌తో కొత్తగా కనిపించారు. సంప్రదాయ ప్రకారం పెళ్లి తంతు ముగిసింది. అయితే చివరిలో తమ భాగస్వామిని కిస్ చేసే విషయంలోనే కొంచెం వెరైటీగా ఫీలయ్యారీ లవర్స్. ఇలా కిస్ చేయడం కొత్తగా అనిపించిందని, కానీ ఆరోగ్యం దృష్ట్యా తప్పనిసరి అని జాన్ పాల్ అనే ఓ ప్రేమికుడు అన్నాడు.

అన్ని జాగ్రత్తలూ

చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పటికే దాదాపు 25కు పైగా దేశాల్లో విస్తరించింది. ఒక్క ఆ దేశంలోనే 2,236 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫిలిప్పీన్స్‌లోనూ 30 మందికి పైగా వైరస్ బారినపడగా.. ఒకరు మరణించారు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ఈ వైరస్ భయం ఉన్నప్పటికీ సామూహిక వివాహాలకు భారీ సంఖ్యలో జనం రావడంపై మేయర్ ఎవెలియో లియోనార్డియా మాట్లాడుతూ.. తమ కుటుంబాలు స్ట్రాంగ్‌గా ఉంటే సిటీ కూడా బలంగా ఉంటుందని అన్నారు. అయితే కరోనా వైరస్ వ్యాపిస్తున్న దృష్ట్యా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నట్లు చెప్పారు. ఈ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ హెల్త్ చెకప్ చేసి.. ట్రావెల్ హిస్టరీ కూడా పరిశీలించాకే అనుమతించినట్లు తెలిపారు.

Latest Updates