చేతబడి చేస్తుండగా భారీ పేలుడు, స్వామిజీ సజీవ దహనం

చేతబడి చేస్తున్న సమయంలో భారీ పేలుడు సంభవించడంతో, ఆ పూజలు చేసే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఈ సంఘటన తమిళనాడులోని తిరువల్లూరు జిల్లా ఎరాయమంగళంలో జరిగింది. మృతుడు చెన్నైలోని నంగనల్లూరుకు చెందిన స్వామీజీ గోవిందరాజ్ (49) గా గుర్తించారు.

క్షుద్రపూజలు చేసే గోవిందరాజ్.. గత 15 సంవత్సరాలుగా ఎరాయమంగళంలో నివాసముంటూ, ఓ ఆశ్రయం కూడా ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు జ్యోతిష్యం, సాంప్రదాయక కర్మలు చేస్తున్నాడు. తన వద్దకు సమస్యలతో వచ్చే జనాలకు ఏవో పరిష్కారాలు చెబుతూ కొద్దికాలంలోనే చాలా ఫేమస్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ వివాహిత తన సమస్య పరిష్కారానికై 15 రోజుల క్రితం స్వామీజీని సందర్శించి అతని ఆశ్రమంలోనే బస చేసింది .

ఎప్పటిలాగే, ప్రతిరోజూ పూజలు చేసే స్వామీజీ బుధవారం రాత్రి 9 గంటలకు ఆమె కోసం ప్రత్యేక పూజను ప్రారంభించారు. రాత్రి 10 గంటల సమయంలో పూజ చేస్తుండగా ఆ గదిలో భారీ పేలుడు సంభవించింది. ఆ శబ్దం విని పక్క గదిలో ఉన్న లావణ్య అక్కడికి వచ్చి చూడగా ఆ స్వామీజీ  మంటలకు ఆహుతి అవ్వడం కనిపించింది. వెంటనే ఆమె ఈ విషయాన్ని సమీపంలోని స్థానికులకు తెలియజేసింది. వారు ఆ గదికి చేరే లోగా గోవిందరాజ్ ఆ మంటల్లో సజీవ దహనమై కనిపించాడు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తిరువల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డిఎస్పీ నళిని నేతృత్వంలోని పోలీసు బృందం గురువారం సంఘటన స్థలాన్ని సందర్శించి సాక్ష్యాలను సేకరించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి,  దర్యాప్తు జరుపుతున్నారు.

Massive blast while performing black magic, Swamiji burned alive in TN

Latest Updates