కశ్మీర్ లో అతిపెద్ద ఉగ్రదాడి :27మంది CRPF జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్ లో భారీ ఉగ్రదాడి జరిగింది. 2016లో ఉరీలోని సైనిక స్థావరంపై దాడి తర్వాత ఇదే అతిపెద్ద దాడిగా భావిస్తున్నారు. CRPF కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన IED పేలుడులో 27 మంది CRPF సిబ్బంది చనిపోయారు. మధ్యాహ్నం 3గంటల 15నిమిషాల సమయంలో శ్రీనగర్… జమ్మూ హైవేపై పుల్వామా జిల్లా అవంతిపొర దగ్గర్లో… పేలుడు జరిగింది. పేలుడులో 40 మంది వరకు CRPF సిబ్బంది గాయపడగా… 15మంది పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది. గాయపడ్డవారిని వేర్వేరు హాస్పిటల్స్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.

CRPF కాన్వాయ్ లో 70 వాహనాలుండగా… దాదాపు 2500 మంది సిబ్బంది ప్రయాణిస్తున్నట్టు ఢిల్లీలోని హోంశాఖ వర్గాలు తెలిపాయి. పేలుడు జరిగాకా… ఉగ్రవాదులు కాల్పులు జరిపారని భావిస్తుండగా… జమ్మూకశ్మీర్ పోలీసులు మాత్రం క్లారిటీ ఇవ్వడంలేదు. అలాగే ఆయుధాలున్న ఓ జీపును కూడా ఉగ్రవాదులు ఎత్తుకెళ్లారని సమాచారం.

పుల్వామా ఘటన ఆత్మాహుతి దాడిగా తెలుస్తోంది. జైషే మొహమ్మద్ సంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ ఈ ఘటనకు పాల్పడినట్టు సమాచారం. అదిల్ అహ్మద్ దార్ అలియాస్ వఖాస్ గుండిబాఘ్, కాక్ పొరా ప్రాంతానికి కమాండోగా పనిచేస్తున్నాడు. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటికొచ్చింది. దాడికి పాల్పడే ముందు వీడియో తీసినట్టగా భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.

దాడి సమాచారం తెలియగానే… సీనియర్ CRPF అధికారులు స్పాట్ కు చేరుకున్నారు. గాయపడ్డవారిని హాస్పిటల్స్ కు తరలించడంతో పాటు… ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ అంశంలో CRPF డైరెక్టర్ జనరల్ RR  భట్నాగర్ తో మాట్లాడారు కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.

ఈ దాడికి పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ బాధ్యత ప్రకటించుకుంది. జైషే మొహమ్మద్ చేసిన రెండో భారీ దాడి ఇది. 2004లో ఆ సంస్థ BSF క్యాంప్ పై జరిపిన ఆత్మాహుతి దాడిలో 28 మంది BSF సిబ్బంది చనిపోయారు. 2016 సెప్టెంబర్ లో ఉరీలోని సైనిక క్యాంప్ పై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19మంది సైనికులు, నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ఆ తర్వాత ఆ స్థాయిలో ఉగ్రదాడి జరగడం ఇదే మొదటిసారి. అవంతి పొర ప్రాంతం, పుల్వామా జిల్లాల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువ ఎన్ కౌంటర్లు జరగగా… ఉగ్రవాదులను భారీగా చంపేశాయి భద్రతా బలగాలు.

Latest Updates