నడుస్తూనే రికార్డులు సృష్టిస్తున్నాడు

అధిక బరువు, కాళ్ల నొప్పులు ఆయనను బాధించాయి. మందు బిళ్లలు మింగితేకానీ కుదుటపడని ఆరోగ్యం. సహకరించని శరీరంతో విసిగిపోయాడు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు నడకపై దృష్టి పెట్టాడు. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల మైళ్లు నడిచాడు. ఇప్పుడు అతను నడుస్తుంటే రికార్డులు పరుగెత్తుకుంటూ వస్తున్నాయి. ‘వాకింగ్​మ్యాన్’​గా పేరొంది.. చాంపియన్​గా అవతరించాడు పాలమూరు జిల్లాకు చెందిన వెంకటయ్య. ఆయన స్ఫూర్తితో ఎంతోమంది మైదానాల బాట పడుతున్నారు.

మహబూబ్‍నగర్‍: వెంకటయ్య సబ్‍రిజిస్ట్రార్‍గా పనిచేస్తున్నాడు. డ్యూటీకి వెళ్లడం.. కుర్చీలో గంటల తరబడి కూర్చోవడం… మళ్లీ ఇంటికి రావడం. రొటీన్​ లైఫ్​గా మారింది. కదలకుండా కూర్చోవడం వల్ల కాళ్ల నొప్పులు బాధించాయి. ఆ తర్వాత మెడనొప్పులు. దీనికితోడు అధిక బరువు.. లాంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డాడు. డాక్టర్‍ దగ్గరకు వెళ్లడం.. మందులు వాడటం.. దినచర్యగా మారింది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనుకున్నాడు. అందుకు నడకే సరైన మార్గం అనుకున్నాడు. ఫ్యామిలీ డాక్టర్​ను సంప్రదిస్తే ఆయన కూడా వాకింగ్​ చేయమని సలహా ఇచ్చాడు. అప్పుడు ఆయన వయసు నలభై ఆరు.  వాకింగ్​ చేయడం మొదలుపెట్టాడు. మొదట్లో స్లో వాకింగ్​ చేసిన వెంకటయ్య.. ఆ తర్వాత స్పీడ్​ వాక్​పై దృష్టి పెట్టాడు. వాకింగ్​లో స్పీడ్​ పెంచడంతో నొప్పులు తగ్గాయి. మానసికంగా, శారీరకంగా చురుగ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వయసు డెబ్భై రెండు. ఈ వయసులోనూ చురుగ్గా వాకింగ్​ చేస్తున్నాడు. ఉల్లాసంగా వాకింగ్​ చేస్తూ, తోటివారిని వాకింగ్​కు తీసుకెళ్తున్నాడు. వెంకటయ్య  ఏ మైదానంలో కనపించినా పెద్దలు, పిల్లలు ఆయనతో కలిసి అడుగులు వేస్తుంటారు. ఒక్కసారి స్పీడ్​ వాక్​ మొదలుపెడితే.. ఆయనను అందుకోవడం కష్టమే ఎవరికైనా.

స్టేట్‍ చాంపియన్​

వెంకటయ్య మాస్టర్‍ అథ్లెటిక్స్​లో ఐదు కిలోమీటర్ల స్పీడ్​ వాక్​ విభాగంలో  స్టేట్​ చాంపియన్​. తెలంగాణలో ఎక్కడ పోటీలు జరిగినా వెంకటయ్య వెళ్తాడు. 2014–19 వరుసగా చాంపియన్​గా నిలిచి గోల్డ్​మెడల్​ సాధించాడు. ఈ ఏడాది  ఫిబ్రవరి గుంటూరులో జరిగిన జాతీయ స్థాయి స్పీడ్‍వాక్‍లో ఆరో స్థానంలో నిలిచాడు. ఆరోగ్యం కోసం నడక మొదలుపెట్టిన వెంకటయ్య పతకాల మీద పతకాలు సాధిస్తున్నాడు. ఆయన వాకింగ్​కు ఎంతోమంది అభిమానులయ్యారు. పిల్లలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని రన్నింగ్​ పోటీలకు వెళ్తున్నారు. వాళ్లు కూడా పతకాలు సాధిస్తున్నారు. ఈ వయసులో పోటీలు అవసరమా అని వెంకటయ్యను అడిగితే… ‘ఆరోగ్యమే మహాభాగ్యం.. చదువే సంపద. మనిషికి రెండు లక్షణాలు కచ్చితంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండటం, బాగా చదువుకోవడం అవసరం. నాకు చదువు ఉంది. అందుకే ఆరోగ్యంపై దృష్టి పెట్టా. పిల్లలు కూడా నా బాటలో నడుస్తూ పతకాలు సాధిస్తున్నారు’ అని చెప్పాడాయన.

 

 

Latest Updates