
హైదరాబాద్, వెలుగు : నగరంలో 83 శాతం మందికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్ వెల్లడించింది. దేశంలో వివిధ నగరాల్లో ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకున్న నగరంగా హైదరాబాద్ ఉందని పేర్కొంది. నేషనల్ యావరేజ్ తీసుకుంటే 65 శాతం మంది మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు తెలిపింది. మ్యాక్స్ లైఫ్, కంటర్ ఐఎంఆర్బీలు కలిసి ‘ఇండియా ప్రొటెక్షన్ కోషెంట్’ సర్వేను విడుదల చేశాయి. ప్రొటెక్షన్ కోషెంట్లో హైదరాబాద్‌కు 100కు 44 ర్యాంక్ వచ్చింది. అర్బన్ ఇండియా నేషనల్ యావరేజ్ మాత్రం 35 ఉంది. అంటే నేషనల్ యావరేజ్‌తో పోలిస్తే హైదరాబాద్ ప్రొటెక్షన్ కోషెంటే ఎక్కువగా ఉంది. భవిష్యత్‌లో వచ్చే పరిణామాలను ఎదుర్కొనేందుకు పాలసీ హోల్డర్స్ ఆర్థికంగా ఎలా సన్నద్ధమవుతున్నారనే దానిపై ఈ సర్వే నిర్వహించారు. పాలసీలను కొనేటప్పుడు పాలసీ హోల్డర్స్కున్న ఆందోళనలు, వారు వేటికి ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నారు? ఓనర్షిప్, టర్మ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన వంటి వాటిని కూడా ఈ సర్వేలో అధ్యయనం చేశారు. అయితే నలుగురిలో ఒక్కరు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారని తెలిసింది. సర్వేలో పాల్గొన్న మొత్తం రెస్పాండెంట్లలో కేవలం 23 శాతం మంది మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నారు. ఇన్సూరెన్స్ సబ్కేటగిరీలు టర్మ్ ప్లాన్, మార్కెట్ లింక్డ్ ప్లాన్, సేవింగ్స్ ప్లాన్ వంటి విషయాలపై బెంగళూరుతో పోలిస్తే.. హైదరాబాదీలకే రెండింతలు ఎక్కువ అవగాహన ఉంటుందని మ్యాక్స్ లైఫ్ పేర్కొంది.
ఇన్సూరెన్స్ తీసుకోవడంలో
మహిళలు వెనుకడుగే…
అర్బన్ ఇండియాలో పురుషులతో పోలిస్తే.. మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌లను తక్కువగా తీసుకుంటున్నారని సర్వే వెల్లడించింది. 68 శాతం పురుషులకు అర్బన్ ఇండియాలో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలుంటే.. 59 శాతం మహిళలు మాత్రమే లైఫ్ ఇన్సూరెన్స్‌లు తీసుకున్నట్టు పేర్కొంది. కేవలం 19 శాతం మహిళలకు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈ అంతరం ఎక్కువగా ఉంది.
మిలీనియల్స్‌కు పట్టింపు లేదు..
25 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యనున్న అర్బన్ ఇండియా మిలీనియల్స్‌లో 43 శాతం మంది కనీసం తమ కుటుంబాల ప్రొటెక్షన్ గురించి అసలు ఆలోచించడం లేదని సర్వే తేల్చింది. కేవలం 44 శాతం యూత్‌కు మాత్రమే టర్మ్ ఇన్సూరెన్స్‌పై అవగాహన ఉంటుందని, వారిలో కేవలం 17 శాతం మంది మాత్రమే ఈ పాలసీను తీసుకుంటున్నారని చెప్పింది. సౌత్ ఇండియాలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్టు పేర్కొంది. భవిష్యత్ ఆర్థిక అవసరాల పొదుపులకు, ఓల్డ్ ఏజ్ సెక్యురిటీలకు యూత్ పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదని వెల్లడైంది. 79 శాతం అర్బన్ ఇండియన్లు ఏజెంట్ అడ్వయిజరీల నుంచే టర్మ్ ఇన్సూరెన్స్‌లు కొనడానికి మొగ్గుచూపుతున్నారు. 15 శాతం మంది మాత్రమే బ్యాంక్‌ల ద్వారా కొంటున్నారు.