స్టార్టప్‌‌లకు కేరాఫ్‌‌ ఢిల్లీ: ఏడు వేల కంపెనీలతో తొలిస్థానం

హైదరాబాద్‌‌లో 1,940 స్టార్టప్‌‌లు

న్యూఢిల్లీ: దేశానికే కాదు స్టార్టప్‌‌ కంపెనీలకు ఢిల్లీ రాజధానిగా మారింది. ఇక్కడ ఏడు వేల స్టార్టప్‌‌లతోపాటు 10 యూనికార్న్‌‌ స్టార్టప్‌‌లు ఉన్నాయి. వీటి వాల్యుయేషన్‌‌ 50 బిలియన్‌‌ డాలర్లపైమాటే! ఢిల్లీ తరువాతిస్థానాల్లో బెంగళూరు, ముంబై నిలిచాయి. ‘టై–ఢిల్లీ–ఎన్సీర్‌‌’, జినోవ్‌‌ కంపెనీలు ‘టర్బోచార్జింగ్‌‌ ఢిల్లీ–ఎన్సీఆర్‌‌–స్టార్టప్‌‌ ఎకోసిస్టమ్‌‌’ పేరుతో విడుదల చేసిన స్టడీ రిపోర్ట్‌‌ ఈ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో 7,039 , బెంగళూరులో 5,234, ముంబైలో 3,829, హైదరాబాద్‌‌లో 1,940 స్టార్టప్‌‌లు ఉన్నాయి. ఢిల్లీలో 4,491, దీనిని ఆనుకుని ఉండే గురుగ్రామ్‌‌లో 1,544, నోయిడాలో 1,004 స్టార్టప్‌‌లు ఉన్నాయి. ఢిల్లీలో 10 యూనికార్న్‌‌లు ఉండగా, బెంగళూరులో తొమ్మిది, ముంబైలో రెండు, పుణేలో రెండు, చెన్నైలో ఒకటి ఉన్నాయి. బిలియన్ డాలర్ల (దాదాపు రూ.7,200 కోట్లు) కంటే ఎక్కువ వాల్యుయేషన్ కలిగిన కంపెనీలను యూనికార్న్‌‌లుగా పిలుస్తారు.

ఢిల్లీలో అపార అవకాశాలు..

‘టాప్‌‌–5’ గ్లోబల్ స్టార్టప్‌‌ హబ్‌‌లలో ఒకటిగా ఎదిగే సత్తా ఢిల్లీకి ఉందని ఈ రిపోర్ట్‌‌ అంచనా వేసింది. ‘‘ఢిల్లీలో స్టార్టప్‌‌లకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. 2013 నుంచి ఇక్కడ ఏటా ఒక యూనికార్న్‌‌ ఏర్పాటైంది. ఫిన్‌‌టెక్‌‌, ఈ–కామర్స్‌‌, లాజిస్టిక్స్‌‌, ఫుడ్‌‌, ఎనర్జీ తదితర రంగాల స్టార్టప్‌‌లు, యూనికార్న్‌‌లు ఇక్కడి నుంచే సేవలు అందిస్తున్నాయి’’ అని టై ఢిల్లీ ప్రెసిడెంట్‌‌ రాజన్‌‌ ఆనందన్‌‌ చెప్పారు. ఇండియన్‌‌ స్టార్టప్‌‌ ఎకోసిస్టమ్‌‌ మొత్తం వాల్యుయేషన్‌‌ 56 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇందులో సగం ఢిల్లీ స్టార్టప్‌‌ల నుంచే వస్తున్నదని ఈ రిపోర్టు వెల్లడించింది. బెంగళూరులో స్టార్టప్‌‌ల వాల్యుయేషన్‌‌ 37 బిలియన్‌‌ డాలర్ల వరకు ఉంది. ముంబై కంపెనీల వాల్యుయేషన్‌‌ 12 బిలియన్‌‌ డాలర్ల వరకు ఉంది. అత్యధిక వాల్యుయేషన్‌‌ కలిగిన టాప్‌‌–10 స్టార్టప్‌‌లలో ఐదు ఢిల్లీలోనే ఉండటం మరో విశేషం. అయితే, మిగతా నగరాలతో పోలిస్తే గత రెండేళ్లుగా ఢిల్లీ స్టార్టప్‌‌ల ఏర్పాటు నెమ్మదించింది.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా 800 స్టార్టప్‌‌లు ఏర్పాటయ్యాయని ఆనందన్‌‌ చెప్పారు. వీటి సంఖ్య పెరగాలంటే నిధులు మరింత సులువుగా లభించాలని, మరింత మంది ఏంజెల్‌‌ ఇన్వెస్టర్ల అవసరం ఉందని వివరించారు. ‘‘ఢిల్లీ వంటి నగరాల్లో కో–వర్కింగ్‌‌ ఆఫీసులు చవకగా అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం వీటిలో ఒక్కో డెస్క్‌‌కు స్టార్టప్‌‌లు రూ.9,500 నుంచి రూ.13,500 వరకు చెల్లిస్తున్నాయి. కొత్త కంపెనీలకు ఇంత మొత్తం చాలా ఎక్కువ. స్టార్టప్‌‌లకు చవకగా ఆఫీస్‌‌ స్పేస్‌‌ అందుబాటులోకి రావడానికి హైదరాబాద్‌‌లో మాదిరిగా మిగతా నగరాల్లోనూ ప్రత్యేక హబ్‌‌లు ఏర్పాటు కావాలి’’ అని పేర్కొన్నారు. ఈ స్టడీ రిపోర్ట్‌‌ విడుదల చేసిన అనంతరం నీతి ఆయోగ్‌‌ సీఈఓ అమితాబ్‌‌ కాంత్‌‌ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ, గురుగ్రామ్‌‌, నోయిడాలో స్టార్టప్‌‌ల కోసం ప్రత్యేక హబ్‌‌లు ఏర్పాటు కావాలని అన్నారు.

Latest Updates