పోరాట స్ఫూర్తి మేడే

ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేదేమి లేదు బానిస సంకెళ్లు తప్ప అన్న  మాటలు…. ప్రపంచ కార్మిక గతినే మార్చేసాయి.  చికాగో కార్మికుల పోరాటం.. ప్రపంచ కార్మికుల ఉద్యమ వేడిని రగిల్చింది. సరిగ్గా 133 ఏళ్ల క్రితం అమెరికాలో చిందిన కార్మికుల రక్తమే ఎర్రజెండాగా మారింది. చరిత్రలో ఒక చైతన్య దినంగా నిలిచిపోయింది.

మేడే… ప్రపంచం వ్యాప్తంగా కార్మికుల పండగ రోజు. బానిస బతుకుల్ని ఆపిన రోజు. పోరాటం చేస్తేనే హక్కులన్నీ దక్కుతాయని జెప్పిన రోజు…. శ్రమ దోపిడీకి వ్యతిరేకంగ కార్మిక లోకం కదం తొక్కిన రోజు. రక్తం దారపోసి 8 గంటల పని హక్కును సాధించుకున్న రోజే మే డే.

1886లో మేడే ప్రారంభమైంది. అప్పట్లో అమెరికాలోని పెట్టుబడి దారులు కార్మికులతో  రోజుకు 15 నుంచి 20 గంటలు చాకిరీ చేయించుకునే వారు. కూలీలను బానిసల్లా చూసేవాళ్లు యజమానులు. పరిశ్రమల్లోనే కార్మికుల బతుకులు తెల్లారిపోయేవి. ఈ నరకయాతన నుంచి విముక్తి కోసం చికాగో పట్టంలో కూలీలు పోరుబాట పట్టారు. 8 గంటల పని దినం కోసం సమరశంఖం పూరించారు. డిమాండ్ల సాధనకు ఐక్యంగా సమ్మెకు దిగారు.

కార్మిక సమ్మెను సహించలేని యజమానులు…గూండాలను, పోలీసులను ప్రయోగించారు. ఖాకీల కాల్పుల్లో అనేకమంది కార్మికులు నేలకొరిగారు. రక్తం ఏరులై పారింది. ఆ అమరవీరుల రక్తంతో తడిచి నింగికి ఎగసింది ఎర్ర జెండా. అదే నేడు ప్రపంచంలోని కార్మికులందరికీ పోరాట పతాక మైంది. చరిత్రలో ఒక చైతన్య దినంగా నిలిచిపోయింది.

చికాగోలోని కార్మికుల రక్తతర్పణం ప్రపంచంలోని శ్రమజీవు లందరికీ వెలుగును అందించింది. ఈ ఘర్షణలో ఒక కానిస్టేబుల్ కూడా మరణించాడు. దీన్ని సాకుగా తీసుకొని నలుగురు కార్మికనేతల్ని ఉరితీశారు. ఈ పోరాట స్ఫూర్తితో ప్రపంచ వ్యాప్తంగా 8 గంటల పని, వేతనాల పేంపు, భద్రత కోసం ఉద్యమాలు ఉధృతమయ్యాయి. రష్యాలో 1917 మొదటి సోషలిస్టు ప్రభుత్వం ఏర్పాటుకు దారి తీశాయి. మన దేశంలో మద్రాసు నగరంలో 1923లో తొలి మేడే జరుపుకున్నారు. యూరపుకంటే మన దేశంలో పరిశ్రమలు ఆలస్యంగా వచ్చాయి. దీనివల్ల మనదేశంలో కార్మికోద్యమాలూ ఆలస్యమయ్యాయి.

1991లో సోవియట్ యూనియన్ కుప్పకూలి పోవడంతో కార్మికోద్యమానికి కష్టకాలం మొదలైంది. సామ్రాజ్యవాదులకు ఎదురులేకుండా పోయింది. సరళీకరణ పేరుతో కార్మికులపై దాడి పెరిగింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. పనిగంటలు అధికమయ్యాయి. భారత దేశంలోనూ  కార్మికులు కనీస హక్కులు దక్కడం లేదు. అసంఘటిత రంగం పనిచేస్తున్న కార్మికులకు భద్రత లేకుండాపోయింది. దీంతో  హక్కులతో పాటు ఉద్యోగ భద్రత కోసం కార్మికులు ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Latest Updates