
- లాక్ డౌన్, సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటింకుంటే మారో మార్గం లేదు
- 75% కేసులు లక్షణాలు లేకుండా నమోదైనవే: మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి
భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ భారీగా పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఆదివారం ఉదయం వరకు 8,356 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇందులో అత్యధికంగా మహారాష్ట్రలోనే దాదాపు 1800కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏప్రిల్ 14న ముగుస్తున్న లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే. అయితే ప్రజలు సహకరించకుంటే లాక్ డౌన్ ఏప్రిల్ 30 తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాల్సిన పరిస్థితి వస్తుందని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే స్పష్టం చేశారు. లాక్ డౌన్ పక్కగా పాటించపోయినా.. సోషల్ డిస్టెన్స్ పాటించకున్నా రాష్ట్రం పెను ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మహారాష్ట్రలో ఉన్న మొత్తం కేసుల్లో 90 శాతం వరకు ముంబై, నవీ ముంబై, థానే, పుణేల్లోనే ఉన్నట్లు తెలిపారాయన. ఈ ప్రాంతాల్లో రెడ్ జోన్లుగా ప్రకటించామన్నారు. శనివారం ప్రధాని మోడీతో సీఎంలు, ఆరోగ్య శాఖ మంత్రులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం తర్వాత తోపే ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా లాక్ డౌన్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.
15 కంటే ఎక్కువ కరోనా కేసులున్న జిల్లా.. రెడ్ జోన్
దేశంలోని అన్ని జిల్లాలను రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా విభజించాలని ప్రధాని మోడీ ఆ సమావేశంలో సూచించినట్లు తెలిపారు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే. ఏదైనా జిల్లాలో 15 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదైతే దాన్ని రెడ్ జోన్ గా, 15 అంతకంటే తక్కువ కేసులుంటే ఆరెంజ్ జోన్, ఒకే ఒక్క కేసులు, లేదా జీరో కేసులు ఉన్న జిల్లాలను గ్రీన్ జోన్లుగా విభజించినట్లు ఆయన చెప్పారు. ఈ జోన్లకు సంబంధించిన ఒకటి రెండ్రోజుల్లో గైడ్ లైన్స్ వస్తాయన్నారు. ఆ మార్గదర్శకాలు వచ్చిన తర్వాత గ్రీన్ జోన్లుగా ఉన్న జిల్లా సరిహద్దులు మూసేసి అక్కడ కొన్ని పనులు మొదలుపెడతామని చెప్పారు. ఏవైనా ఇండస్ట్రీలను పనులకు అనుమతించినా సోషల్ డిస్టెన్స్ తప్పనిసరి అన్నారు మంత్రి రాజేశ్ తోపే. అన్ని మార్గదర్శకాలపై ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించే సందర్భంగా ప్రకటించే అవకాశం ఉందన్నారు. అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ సీఎం ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారని, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పారు. ప్రజలు సహకరించకుంటే ఆ తర్వాత కూడా లాక్ డౌన్ పొడిగించాల్సి రావడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదన్నారు మంతి తోపే. రాష్ట్రంలో 75 శాతం కరోనా కేసుల్లో ఎటువంటి లక్షణాలు లేకుండానే నమోదయ్యాయని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.