నేను అందుకే పెళ్లి చేసుకోలేదు: మాయావతి

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ లో తన విగ్రహాలు, ఏనుగు బొమ్మల ఏర్పాటును బీఎస్పీ చీఫ్ మాయావతి సమర్థించుకున్నారు. ప్రజలకోరిక మేరకే వాటిని ఏర్పాటు చేసినట్లు మంగళవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ‘అధికారం చెలాయించే వారి చెరనుంచి ప్రజలకు విముక్తి కలిగించాలని ఎన్నో ఏళ్ల కిందట నిర్ణయించుకున్నా. వారి కోసం నా జీవితాన్ని త్యాగం చేశా. అందుకే పెళ్లి చేసుకోలేదు. నిరుపేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన దళిత మహిళ గౌరవార్థం ప్రజలే విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు’ అని అఫిడవిట్ లో పేర్కొన్నారు. విలువలు, ఆదర్శాలను ప్రచారం చేసే ఉద్దేశంతోనే వాటి నిర్మించామని, పార్టీ ప్రచారం కోసం కాదన్నారు. దీని కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించామని, అసెంబ్లీ అనుమతి కూడా తీసుకు న్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. తనపై దాఖలైన పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు. విగ్రహాల నిర్మాణానికి ఖర్చు పెట్టిన డబ్బులను తిరిగి చెల్లించా లని ఫిబ్రవరి 8న మాయావతికి సుప్రీంకోర్టు ఆదేశించింది. పార్టీ ప్రచారం కోసం విగ్రహాలను ప్రతిష్టించేందుకు మాయావతి రూ.2 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని 2009లో ఓ లాయర్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది.

Latest Updates