కట్టేసి ఉన్న కాళ్ళు, చేతులు.. బావిలో MBBS విద్యార్థి శవం

కట్టేసి ఉన్న కాళ్లు, చేతులు బావిలో మెడికో శవం

రేగొండ, వెలుగు: కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మెడిసిన్​ స్టూడెంట్​మృతదేహం బావిలో కనిపించడం జయశంకర్​ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కనిపర్తి గ్రామంలో కలకలం రేపింది. ఎస్సై గుర్రం కృష్ణప్రసాద్​ వివరాల ప్రకారం.. తుమ్మనపల్లి వంశీ(25) ఖమ్మం జిల్లా కేంద్రంలోని మమత మెడికల్​ కాలేజీలో మెడిసిన్​ థర్డ్​ఇయర్​ చదువుతున్నాడు. సంక్రాంతి సెలవులకు కనిపర్తికి వచ్చిన వంశీ శుక్రవారం ఉదయం కాలేజీకి ఖమ్మం బయలుదేరాడు. రాత్రి 8 గంటలకు తండ్రి తిరుపతి ఫోన్​ చేయగా ఖమ్మం చేరుకున్నట్లుగా చెప్పాడు. శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు తిరుపతి వెళ్లగా ఒడ్డున కొడుకు బ్యాగు, సెల్​ఫోన్, చెప్పులు ఉండటంతో గ్రామస్తులకు సమాచారం అందించి వెతకడం ప్రారంభించాడు. బావిలో ఇనుప వంతెనలతో వెతుకుతుండగా వంశీ మృతదేహం చిక్కింది. చేతులు వెనక్కి తిప్పి చీర పోగుతో కట్టి ఉన్నాయి. కాళ్లు సైతం కట్టి ఉండడంతో మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆత్మహత్య… హత్యా?

వంశీని హతమార్చేంత కక్షలు గ్రామంలో ఎవరికీ లేవని పలువురు పేర్కొంటున్నారు. డాక్టర్ ​కావాలనే పట్టుదలతో మెడిసిన్​ ఫ్రీ సీటు సాధించాడని తెలిపారు. అందరితో కలివిడిగా ఉండేవాడని అన్నారు. అయితే గత సంవత్సరం ఇదే వ్యవసాయ బావిలో దూకి తాను చనిపోతున్నట్లుగా కుటుంబీకులకు సమాచారం అందించి మళ్లీ మోటార్​పైప్​సహాయంతో ఒడ్డుకు చేరినట్లుగా తెలిపారు. శుక్రవారం కాలేజీకి అని వెళ్లిన వంశీ సాయంత్రం చలివాగు ఒడ్డున ముభావంగా కూర్చుని ఉండటం గ్రామస్తులు చూసినట్లుగా చెబుతున్నారు. రాత్రి 8 గంటలకు తండ్రి ఫోన్​చేయగా ఖమ్మం చేరుకున్నట్లుగా చెప్పిన కొడుకు తెల్లవారేసరికి తన వ్యవసాయ బావిలోనే శవంగా కనిపించడంతో  తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సెల్​ఫోన్​ స్వాధీనం చేసుకుని కాల్​డేటాను పరిశీలిస్తున్నారు.

 

Latest Updates