ఫిబ్రవరి 24 నుంచి సమ్మక్క సారలమ్మ మినీ జాతర

వరంగల్: ఆదివాసీల జాతర.. ఆసియా ఖండంలోనే అతి పెద్ద జాతర మేడారం సమ్మక్క జాతర. ఈ జాతరకు దేశ, విదేశాల నుండి తరలివచ్చిన భక్తులు అమ్మ వారలను దర్శించుకోవడం ఆనవాయితీ. రెండేళ్ల కొకసారి మేడారం జాతర నిర్వహించేది. అయితే ఈ యేడాది పిబ్రవరిలో మీనీ మేడారం జాతర నిర్వహించాలని దేవదాయ శాఖ అధికారులు,  మేడారం సమ్మక్క సారలమ్మ పూజారులు, మేడారం ట్రస్టు కమిటీ ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఈ మినీ మేడారం జారతను ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వ హించనున్నట్లు పూజారులు తెలిపారు. ఫిబ్రవరి 24 బుధవారం  గుడిశుద్ధి, పూజాకార్యక్రమాలు, ఇదే రోజు ఉదయం గ్రామ నిర్భంధనం నిర్వహిస్తామని చెప్పారు.25 గురువారం సమ్మక్క, సారాలమ్మ లకు పసుపు, కుంకుమ లతో అర్చనలు కార్యక్రమాలు నిర్వహిస్తామని  సమ్మక్క ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ చెప్పారు. అయితే 24,25 తేదిలో (బుధ,గురు) వారాల్లో రెండు రోజుల పాటు మేడారంలో మండే మెలిగే పండగలు నిర్వహించుకుంటామని సమ్మక్క ప్రదాన పూజారి అరుణ్ చెప్పారు. ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క –సాలరమ్మలను ఇష్ట దైవంగా కొలిచే తాము తమ సాంప్రదాయ బద్దంగా మేడారం జాతర ప్రాంగణంలో సమ్మక్క- సార లమ్మ ఆలయాలను శుద్ధి కోసం అందరం కలిసి మెలిసి మండే మెలిగే పండుగ నిర్వహించకుంటామని చెప్పారు. 26,27 తేదీల్లో ( శుక్ర, శని) అమ్మవారలను దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు దైవ దర్శనానికి అవకాశం ఉంటుందని చెప్పారు. భక్తులు  ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా  అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ సభ్యులు వివరించారు.

కరోనా నేపధ్యంలో ప్రత్యేక జాగ్రత్తలతో

తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఈసారి జరుగుతుందా..? లేదా..? అన్న ప్రచారం నేపధ్యంలో పూజారులు మినీ జాతర తేదీలను ఖరారు చేశారు. వచ్చే ఫిబ్రవరి నెలలో 24వ తేదీ నుంచి 27 వరకు మూడు రోజులపాటు అమ్మవార్లకు పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని పూజారులు ప్రకటించారు. దట్టమైన అడవుల్లో, కొండ కోనల మధ్య జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు గత ఏడాది వరకు జాతర ప్రారంభానికి ముందే లక్షలాది మంది తరలివచ్చారు. కరోనా ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న జనం సమ్మక్క-సారలమ్మ జాతరకు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో కేవలం మూడు రోజులకే పరిమితం చేసినట్లు తెలుస్తోంది.

సమ్మక్క-సారలమ్మ జాతరకు 900 ఏళ్ల చరిత్ర

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు 900 ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. జాతరపై కథలు, గాధలు ఎన్నో… 12వ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పొలవాసను పాలించే గిరిజన దొర మేడరాజు ఏకైక కుమార్తె సమ్మక్క. ఆమెను తన మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ దంపతులకు సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే గ్గురు సంతానం. రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పొలవాసపై దండెత్తాడు. ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. అక్కడి కోయ రాజు పగిడిద్ద రాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ కరువు వల్ల కప్పం కట్టలేకపోతాడు. కప్పం కట్టకపోవడం, మేడరాజుకు ఆశ్రయం కల్పించడం, కోయ గిరిజనులలో ఓరుగల్లు రాజ్యానికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోయడం, రాజ్యాధికారాన్ని ధిక్కరించడం వంటి కారణంతో పగిడిద్దరాజుపై ప్రతాపరుద్రుడు ఆగ్రహిస్తాడు. పగిడిద్దరాజును అణచివేయడానికి తన ప్రధానమంత్రి యుగంధరుడితో సలహాపై మాఘ శుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు.

సాంప్రదాయ ఆయుధాలైన విల్లంబులు, బరిసెలతో పగిడిద్దరాజు, సమ్మక్క, సారలమ్మ, నాగమ్మ, జంపన్న, గోవింద రాజులు వేర్వేరు ప్రాంతాల నుండి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి వీరోచితంగా పోరాటం చేస్తారు. సుశిక్షితులైన కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, పగిడిద్దరాజు, సారలమ్మ, నాగులమ్మ, గోవింద రాజులు యుద్ధంలో మరణిస్తారు. పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడతాడు. అప్పటి నుండి అది ‘జంపన్న వాగు’గా ప్రసిద్ధి చెందింది.

గత ఏడాది జనమే జనం..

గత ఏడాది మేడారం మహా జాతర మొదలవకుండానే మేడారానికి లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు. సమ్మక్క, సారలమ్మ జాతర  టైంలో భక్తుల సంఖ్య కోటికి పైనే ఉన్నట్లు అంచనా వేశారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు సౌత్ సెంట్రల్ రైల్వే  ప్రత్యేక రైళ్లు నడుపారు. 400కుపైసగా  సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఈసారి కూడా జనం భారీగా పోటెత్తే అవకాశం ఉండడంతో ఆర్టీసీతోపాటు.. రైల్వే వారు కూడా ప్రత్యేక రైళ్లు నడపాలా..? లేదా అన్న విషయంపై ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

కాబూల్ లో దారుణం.. సుప్రీంకోర్టు మహిళా జడ్జీలపై కాల్పులు

బిడెన్ బృందంలో 20 మంది ఇండో-అమెరిక‌న్లు

సెక్రటేరియట్‌కు రాని సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కడే

Latest Updates