ఆ 4 జిల్లాల్లో సడలింపులొద్దు.. కేసీఆర్ ను కోరిన వైద్యశాఖ

హైదరాబాద్‌, వెలుగు: కరోనా కేసులు, వైరస్​తో మరణిస్తున్న వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల వారే అని, ఆ జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్​డౌన్​ సడలింపులు ఇవ్వొద్దని సీఎం కేసీఆర్​ను వైద్య శాఖ అధికారులు కోరారు. లాడ్​డౌన్​ను ఏ మాత్రం సడలించినా ఈ జిల్లాల్లో వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొన్నారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ అమలుపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్ లో 8 గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య శాఖ అధికారులు తాజా పరిస్థితిపై సీఎంకు నివేదిక ఇచ్చారు. ‘‘వైరస్ వ్యాప్తి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. మొత్తం 1,085 పాజిటివ్ కేసుల్లో 717 మంది(66.08%) ఈ 4 జిల్లాలకు చెందిన వారే. చనిపోయిన వారిలో కూడా 82.21% మంది ఈ జిల్లాల వారే. 10 రోజుల్లో అత్యధిక కేసులు ఈ జిల్లాల్లోనే నమోదయ్యాయి. కాబట్టి ఈ 4 జిల్లాల్లో ఎట్టి పరిస్థితుల్లో సడలింపులు ఇవ్వొద్దు. మిగతా జిల్లాల్లో పరిస్థితి మెరుగైంది. కంటైన్మెంట్ జోన్ల సంఖ్య కూడా తగ్గింది’’ అని నివేదికలో పేర్కొన్నారు. మంగళవారం కేబినెట్ మీటింగ్​లో ఈ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Latest Updates