కాబోయే అమ్మకు అండగా వైద్య సిబ్బంది

  • ఏప్రిల్‌, మే నెలల జాబితా సిద్ధం చేసిన ఏఎన్‌ఎంలు
  •  శిశువులకు జన్మనివ్వనున్న 2336 మంది గర్భిణులు
  •  అందుబాటులో 102 వాహనాలు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్‌‌‌‌లో 1,149, మే నెలలో 1,187 మంది డెలివరీకి సిద్ధంగా ఉన్నారు. మొత్తం 22 పీహెచ్‌‌‌‌సీలు, రెండు సీహెచ్‌‌‌‌సీలు, ఒక ఏరియా హాస్పిటల్‌‌‌‌ ఉండగా,  మార్చి 31 నాటికి వైద్య సిబ్బంది నమోదు చేసిన లెక్కలు ఇవి.  ఏ గర్భిణి ఎప్పుడు ప్రసవిస్తుంది?,  ఎన్నిసార్లు వైద్య పరీక్షలు చేయించుకుంది? హైరిస్కు కేసా? లేక సాధారణ కేసా?, ప్రసవం కోసం ఏ హాస్పిటల్‌‌‌‌ ఎంచుకుంది? ఇలా ఒక క్యాలెండర్‌‌‌‌ను క్షేత్రస్థాయిలో సిద్ధం చేసి ఉంచారు.  డెలివరీ తేదీ దగ్గర పడుతుందనే సరికి నాలుగు రోజులు ముందుగానే హాస్పిటల్‌‌‌‌లో చేరేలా ఆశాలు, ఏఎన్‌‌‌‌ఎంలు తగిన ఏర్పాట్లు చేస్తారు. ముందుగా ఆ హాస్పిటల్‌‌‌‌కు వీరి వివరాలు పంపిస్తారు. ఒకవేళ ఆ గర్భిణి ఎంచుకున్న హాస్పిటల్‌‌‌‌కు వెళ్లకపోతే ఇంకెక్కడికి వెళ్లిందో ఆరా తీస్తారు. వారి వివరాలు, సెల్ ఫోన్, బ్యాంకు ఖాతా నంబరు, ఊరు అన్నీ కంప్యూటర్‌‌‌‌లో నమోదు చేసి ఉంటుంది.

102 వాహనంలో తరలింపు..

డెలివరీ కోసం గర్భిణులను 102 వాహనాల్లో హాస్పిటళ్లకు తరలించడానికి ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా సుమారు 102 వాహనాలు 6, 108 వాహనాలు 6 ఉన్నాయి.  అయితే 108 వాహనాల్లో కరోనా లక్షణాలున్న వారిని తరలిస్తున్నారన్న భయం చాలా మందిలో ఉంది. దీంతో 102 వాహనాల్లో గర్భిణులను తరలించాలని నిర్ణయించారు.

కుటుంబ సభ్యులు ఏం చేయాలి..

డెలివరీ డేట్‌‌‌‌కు నాలుగు రోజులు ముందుగానే అప్రమత్తమవ్వాలి. స్థానిక ఏఎన్‌‌‌‌ఎం, ఆశా, ఆరోగ్య పర్యవేక్షకులకు సమాచారం ఇవ్వాలి. 102 వాహనాన్ని సంప్రదించాలి. గర్భిణిని హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లేటప్పుడు  వెంట ఆధార్‌‌‌‌, రేషన్‌‌‌‌కార్డు, స్థానిక అంగన్‌‌‌‌వాడీ కేంద్రంలో ఇచ్చిన పుస్తకం, బ్యాంకు ఖాతా వివరాలకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకొని వెళ్లాలి. గర్భిణితోపాటు సహాయంగా మరొకరు వెంట ఉండాలి. వారికి అవసరమైన దుస్తులు, ఇతరత్రా తీసుకెళ్లాలి.

Latest Updates