బషీరాబాద్​లో నర్సుల వైద్యం 

వికారాబాద్ జిల్లా, వెలుగు:  సీజనల్​ వ్యాధులతో జనం అవస్థలు పడుతున్నారు. బషీరాబాద్​ మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్​సీ)లో డాక్టర్​ లేక ముగ్గరు నర్సులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహిస్తున్నారు.  ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్​ అశ్వనీ ధీర్ఘకాలిక సెలువు కోసం అప్లై చేయగా ఉన్నతాకారులు నిరాకరించారు. దాంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ప్రస్తుత పీహెచ్​సీలో పనిచేస్తున్న ముగ్గరు నర్సులు తమకు తోచిన వైద్యసేవలు అందిస్తున్నారు. బషీరాబాద్​ పీహెచ్​సీకి పరిసర గ్రామాల నుంచి రోజుకు కనీసం వంద మంది వరకు వైద్యసేవల కోసం వస్తుంటారు. వారికి సరైన వైద్యం అందించడంలో నర్సులు విఫలం అవుతున్నారు.

వైద్యం కోసం వచ్చేవారిని నర్సులు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న తాండూరు జిల్లా హాస్పిటల్​కు రిఫర్​ చేస్తున్నారు. రోగులు తాండూరు వరకు వెళ్ళలేక దగ్గర్లోని ప్రైవేటు హాస్పిటళ్ళను ఆశ్రయించాల్సన పరిస్థితులు నెలకొన్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో డాక్టర్​ నియామకం జరపాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్యఅధికారులు స్పందించి డాక్టర్ ను నియమించి రోగులకు కలిగే ఇబ్బందులను తొలగించాలి అని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

 

Latest Updates