హెచ్చరించకుండానే గేట్లు ఓపెన్​

  • మేడిగడ్డ ప్రవాహంలో చిక్కుకుపోయిన గొర్రెల కాపరులు, 1500 గొర్రెలు
  • ప్రాణాలరచేతిలో పెట్టుకుని రాత్రంతా జాగారం
  • ఆదివారం ఉదయం కాపాడిన పోలీసులు

కాటారం(మహాదేవపూర్), వెలుగు: ఎలాంటి హెచ్చరికలు లేకుండా గేట్లు ఎత్తేయడంతో ముగ్గురు వ్యక్తులు రాత్రంతా గోదావరి ప్రవాహంలో బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వచ్చింది. మహారాష్ట్ర, తెలంగాణ పోలీసులు రిస్క్ చేసి వారిని కాపాడారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం పంకెన గ్రామ శివారులో జరిగింది. ప్రాణహిత నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో మహాదేవపూర్ మండలంలో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి(మేడిగడ్డ) బ్యారేజీ వద్ద ఎలాంటి హెచ్చరికలు లేకుండా శనివారం రాత్రి 82 గేట్లు ఎత్తి నీటిని కిందికి వదిలారు. దీంతో బ్యారేజీ కింది మండలమైన పలిమెల మండలం గోదావరి పరిసర ప్రాంతాలు జలమయమయ్యాయి. పలిమెల మండలం పంకెన వద్ద పచ్చిక బయళ్లలో 1500 గొర్లను మేపుతూ ఉన్న మహాదేవపూర్ మండలం రాపల్లి కోట గ్రామానికి చెందిన మారబోయిన కొమురయ్య, పర్వతాలు, బట్టి సతీష్ ఒక్కసారిగా చుట్టుముట్టిన నీటిలో చిక్కుకుపోయారు. శనివారం రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గొర్రెలతో పాటు అక్కడే గడిపారు. ఆదివారం బంధువులు వెతుకుతూ వెళ్లి వారిని చూశారు. విషయం తెలిసిన మహదేవపూర్ ఏఎస్పీ సాయి చైతన్య మహారాష్ట్ర పోలీసులతో మాట్లాడారు. వారి సాయంతో పడవల్లో వెళ్లి గొర్లను, గొర్ల కాపర్లను కాపాడారు. ఇలా జరగడం ఇది రెండోసారని, గేట్లు తెరిచేటప్పుడు కనీసం చాటింపు కూడా వేయించట్లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాళేశ్వరం వద్ద 10.89 మీటర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద గోదావరి నది 10.89 మీటర్లు ఎత్తుతో గోదావరి ప్రవహిస్తోంది. ఘాట్ వద్ద ప్రజల రక్షణార్థం ఏర్పాటు చేసిన బారికేడ్ లు ప్రవాహంలో మునిగిపోయాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేశారు.

భద్రాచలంలో ఉప్పొంగుతున్న గోదావరి

భద్రాచలం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతోంది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు 48 అడుగుల వద్ద సబ్‍కలెక్టర్‍ భవేశ్‍మిశ్రా రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు 50 అడుగులకు వరద చేరుకుంది. అర్ధరాత్రి దాటాక మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగులు చేరుకుంటుందని సబ్‍కలెక్టర్ వెల్లడించారు. సోమవారం సాయంత్రానికి 55 అడుగులు దాటే ప్రమాదం ఉందన్నారు. భద్రాచలం స్నానఘట్టాలు, కల్యాణకట్ట నీట మునిగాయి.

Medigadda barrage gates opened without any warning

Latest Updates