యూరప్​లో మేడిన్​ ఇండియా ఫ్లైట్​

మొట్టమొదటిసారిగా విదేశాల్లోకి మేడిన్​ ఇండియా విమానం అడుగు పెట్టింది. కమర్షియల్​ రీజనల్​ ఫ్లైట్​ సేవలను అందించనుంది. హిందూస్థాన్​ ఏరోనాటిక్స్​ లిమిటెడ్​ (హాల్​) తయారు చేసిన డోర్నియర్​ 228 విమానాలు ఆ ఘనత సాధించాయి. 2017లో ఈ విమానాలకు టైప్​ సర్టిఫికెషన్​ (టీసీ) వచ్చింది. దీంతో దేశంలో ప్రాంతీయ ఆపరేటర్లు ఈ తేలికపాటి విమానాన్ని ప్రజా ప్రయాణం కోసం వాడే అవకాశం వచ్చింది. తాజాగా డైరెక్టర్​ జనరల్​ ఆఫ్​ సివిల్​ ఏవియేషన్​ (డీజీసీఏ) ఈ విమానాలకు ఇచ్చిన టీసీని  యూరోపియన్​ యూనియన్​ ఏవియేషన్​ సేఫ్టీ ఏజెన్సీ (ఈసా) ఆమోదించింది. దీంతో అక్కడా విమానాలు ఎగిరేందుకు మార్గం దొరికినట్టయింది. దానికి సంబంధించి డీజీసీఏ ట్వీట్​ చేసింది. ‘‘హాల్​ చిన్న విమానం డోర్నియర్​ 228 విమానానికి మన టీసీ వచ్చేసింది.

ఈ నెల 26న ఈసాతో జరిగిన చర్చల్లో మన టీసీని ఒప్పుకుంది. టీసీ ఇవ్వడంలో డీజీసీఏకి ఈసా మద్దతిచ్చింది. మేకిన్​ ఇండియాను ఇది మరో అడుగు ముందుకు తీసుకెళుతుంది” అని ట్వీట్​ చేసింది. ‘‘ఇప్పుడు యూరప్​లోనూ డోర్నియర్​ కమర్షియల్​ ఫ్లైట్​ సేవలందించేందుకు రెడీ అవుతోంది. మేకిన్​ ఇండియా కార్యక్రమానికి ఇది ఊపునిస్తుంది” అని డీజీసీఏ చీఫ్​ అరుణ్​ కుమార్​ చెప్పారు. డోర్నియర్​ 228లో 19 మంది ప్రయాణించొచ్చు. ఇక్కడ కేవలం దానిని మిలటరీ అవసరాల కోసమే వాడేవారు. అయితే, 2017 చివర్లో డోర్నియర్​కు డీజీసీఏ టీసీ ఇచ్చింది. దీంతో ఉడాన్​ పథకం కింద రీజనల్​ కనెక్టివిటీ ఆపరేటర్లూ దానిని మామూలు ప్రయాణికుల సేవల కోసం వాడేలా అవకాశం వచ్చింది. ఒక్కసారి ట్యాంకుల నిండా ఇంధనం నింపితే 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చు. గంటకు 428 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.

Latest Updates