ఎక్కడోళ్లకు అక్కడి తిండే మేలు..మేడిటరేనియన్ ఫుడ్ పై లొల్లి

ఫుడ్​.. కడుపు నింపేదే కాదు. ఆరోగ్యాన్ని కాపాడేది. కల్చర్​ను ప్రతిబింబించేది. ప్రాంతం, కల్చర్​కు తగ్గట్టు తిండి అలవాట్లుంటాయి. మరి, అన్నింట్లో బెస్ట్​ ఫుడ్​ ఏది? అందరికీ అది సరిపోతుందా? అంటే.. మధ్యధరా సముద్ర దేశాల్లో తినే తిండే ప్రపంచంలో అన్నింటికంటే బెస్ట్ ఫుడ్ అని తేల్చారు 25 మందితో కూడిన హెల్త్​, న్యూట్రిషన్​ నిపుణుల ప్యానెల్​. వరల్డ్​ నెంబర్​ వన్​ ఫుడ్​గా ప్రకటించారు. అందరికీ అదే బెస్ట్​ అంటున్నారు. కానీ, దానిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కల్చర్​, ప్రాంతానికి తగ్గట్టు తిండి అలవాట్లుంటాయని, అందరికీ ఒకే డైట్​ను ప్రతిపాదించడం కరెక్ట్​ కాదని ఆంత్రపాలజిస్టులు, హెల్త్​ఎక్స్​పర్ట్​లు, చరిత్రకారులు తేల్చి చెబుతున్నారు. ఎక్కడోళ్లకు అక్కడి తిండే మేలని, ఆ కల్చర్​కు ప్రతిరూపమని, మెడిటరేనియన్​ డైట్​ అందరికీ సరిపోదని అంటున్నారు.

మెడిటరేనియన్ ఫుడ్ అంటే..?

మధ్యధరా సముద్రం చుట్టూ యూరప్, ఆసియా, ఆఫ్రికాలోని 23 దేశాల భూభాగాన్ని మధ్యధరా ప్రాంతంగా పిలుస్తుంటారు. ఈ 23 దేశాల్లోనూ మెడిటరేనియన్ డైట్​లోని పదార్థాలు, పద్ధతులు చాలావరకూ ఒకేలా ఉంటాయి. ఎక్కువగా మొక్కల ఆధారంగా వచ్చే ఆహారమే ఉంటుంది. రెడ్ మీట్, పాల ఉత్పత్తులు తక్కువుంటాయి. చేపలు, ఆలివ్ ఆయిల్ వంటి అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అధికంగా వాడుతుంటారు. రెడ్ వైన్​ను ఒక మోస్తరుగా వాడొచ్చని చెప్తుంటారు. అయితే, ప్రత్యేకంగా ఇదే మెడిటరేనియన్ డైట్ అని చెప్పడం మాత్రం కష్టమని నిపుణులు చెప్తారు. ఎందుకంటే.. మధ్యధరా ప్రాంతంలో 23 దేశాలున్నాయి. వందలాది భాషలు, కల్చర్​లు, ఆచారాలు, పద్ధతులూ ఉన్నాయి. కోట్లాది మంది వలసలు, దేశాల మధ్య వ్యాపారాలూ ఉన్నాయి. అందుకే ఒక దేశం నుంచి మరో దేశానికి రకరకాల ఆహారం, కొత్త వంటలు వస్తూ, కలగాపులగం అయిపోతూనే ఉంటాయని పేర్కొంటున్నారు.

వేల ఏండ్ల చరిత్ర ఉంది..

మధ్యధరా ప్రాంతపు తిండికి వేల ఏండ్ల చరిత్ర ఉందని చెప్తారు. అయితే ఇప్పుడు పాపులర్ అయిన ఫుడ్స్ అన్నీ ఒకేసారి వాడకంలోకి వచ్చినవి కావట. ఒక్కో ఫుడ్ ఐటమ్ ఒక్కో కాలంలో వాడకంలోకి వచ్చి.. ఇప్పటికిలా అన్నీ కలిపి నెంబర్ వన్ ఫుడ్ గా మారాయని అంటున్నారు. ఈ దేశాల్లో 10 వేల ఏండ్ల కిందనే గోధుమ, పప్పుల వంటి పంటలు సాగు చేశారట. అప్పట్లోనే తీరానికి దూరంగా ఉన్న ప్రాంతాలకు చేపల రవాణాతో వ్యాపారం షురువైందని చెప్తారు. ఇక వైన్ తయారీ 6 వేల ఏళ్ల క్రితం ప్రారంభమైందట. మెడిటరేనియన్ డైట్​లో ఎక్కువగా వాడే ఆలివ్ ఆయిల్ 2,500 ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నారని రీసెర్చర్లు పేర్కొంటున్నారు. గొర్రెలు, మేకలు, పశువులు, ఒంటెల పెంపకం కూడా పది వేల ఏళ్ల క్రితమే ఇక్కడ మొదలైందని, రెడ్​మీట్​ (మటన్​, బీఫ్​ లాంటివి), పాల ఉత్పత్తులు కూడా అప్పటి నుంచే వాడుతున్నారని తేలింది.

యునెస్కో గుర్తింపు దక్కింది..

మధ్యధరా తిండికి ఎన్నో స్పెషాలిటీలు ఉన్నాయని ఐక్యరాజ్యసమితి ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్ (యునెస్కో) 2013లోనే గుర్తించింది. ఇది కేవలం పోషకాలతో కూడిన తిండి మాత్రమే కాదని.. ఇందులో స్కిల్స్, నాలెడ్జ్, పంటలు, ఆహారానికి సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాలు, వంటలకు సంబంధించిన అనేక పద్ధతులు ఉన్నాయని యునెస్కో తెలిపింది. ముఖ్యంగా ఇక్కడి జనం తిండిని వినియోగించే విధానం, ఇతరులతో పంచుకునే పద్ధతి చాలా ప్రత్యేకమని పేర్కొంది. అందుకే.. మధ్యధరా తిండిని ‘మానవ జాతికి చెందిన తాకలేని (రూపంలేని) సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో యునెస్కో చేర్చింది. మధ్యధరా తిండి వేల ఏళ్లుగా వాడకంలో ఉన్నా.. 1952 తర్వాత మాత్రమే ఈ ఫుడ్​కు పాపులారిటీ పెరిగిందట. అమెరికాకు చెందిన ఫిజియాలజిస్ట్ యాన్సెల్ కీస్, ఆయన భార్య, బయోకెమిస్ట్ మార్గరెట్ కీస్.. ఇటలీ, స్పెయిన్, తదితర దేశాల్లో ఫుడ్ పై సర్వేలు చేశారట. వాళ్ల వల్లే దీనికి పాపులారిటీ వచ్చిందట.

ఎవరి తిండి.. వాళ్లకు మంచిది 

మనం ప్రతిరోజూ తినే తిండిలో అన్నం, జొన్నరొట్టెలు, కూరగాయలే ఎక్కువగా ఉంటాయి. నార్త్ ఇండియాలో గోధుమ రొట్టెలు, గోధుమ పిండి వంటలే ఎక్కువగా తింటారు. అలాగే కొన్ని దేశాల్లో కొన్నిరకాల తిండే తరతరాలుగా తింటూ వస్తున్నారని, వాళ్లకు ఇతర ప్రాంతాల తిండి సరిపడదని నిపుణులు అంటున్నారు. ఒక్కో ప్రాంతంలోని వాళ్ల శరీరం ఒక్కో రకం తిండినే జీర్ణం చేసుకోగలదని అలాంటప్పుడు మెడిటరేనియన్ డైటే ప్రపంచంలో నెంబర్ వన్ అని చెప్పడం కరెక్ట్ కాదని అభ్యంతరం చెప్తున్నారు. యూరప్ మూలాలు లేని కొన్ని దేశాల ప్రజలకు పాల ఉత్పత్తులు జీర్ణం కావన్నదే ఇందుకు నిదర్శనమని వారు అంటున్నారు. అందుకే.. కేవలం పోషకాల ఆధారంగా బెస్ట్ అని చెప్పడం కాదని.. ఆయా ప్రాంతాల చరిత్ర, కల్చర్, ఫుడ్ ట్రెడిషన్స్ ను కూడా పరిగణనలోకి తీసుకుని.. ఆయా ప్రాంతాలకు ఏది బెస్ట్ ఫుడ్డో తేల్చాలని సూచిస్తున్నారు. నిజానికి ఇప్పటి కాలంలో వేరే దేశాలకూ వలసలు పెరిగిపోతున్నా, ఆ వలసదారులు మాత్రం తమ ట్రెడిషనల్​ ఫుడ్​ను వదులుకోవట్లేదని చెబుతున్నారు. మెడిటరేనియన్​ డైట్​ అన్నది ఏ ఒక్క ప్రాంతానికో చెందినది కాదని,  అన్ని ప్రాంతాల ఫుడ్​ కల్చర్​లోనూ మెడిటరేనియన్​ డైట్​ ఓ భాగంలానే ఉంటోందని వాదిస్తున్నారు. అన్ని దేశాల్లోనూ మెడిటరేనియన్​ మెనూలోని పదార్థాలన్నీ ఉంటున్నాయి.

Latest Updates