ముస్లిం పెళ్లి కార్డుపై గణేశుడు: మతసామరస్యాన్ని చాటడానికేనన్న అమ్మాయి తండ్రి

కష్టంలోనే బంధం బలం బయటపడుతుందంటారు. దీన్ని నిజమని చాటుతూ.. కల్లోల సమయంలోనే హిందూ-ముస్లిం సామరస్యం వెల్లివిరుస్తోంది. ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల వర్గాల నిరసనల్లో రెండు గ్రూపుల మధ్య మూడ్రోజుల క్రితం హింస చెలరేగింది. ఈ ఘటనలను అడ్డుపెట్టుకుని ప్రజల మధ్య చిచ్చుపెట్టాలని అల్లరిమూకలు చేసిన విధ్వంసంలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోయాయి. ఈ సమయంలో ఆ హింస ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రజలకు సంయమనం పాటించాలని ప్రభుత్వం, పోలీసులు కోరుతున్న వేళ.. కొందరు సామాన్యులు సైతం తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. సాధారణ ప్రజల్లో ఎప్పుడూ మత సామరస్యం చెరగదని గట్టి మెసేజ్ ఇస్తున్నారు.

అల్లర్లు జరిగిన రోజున ఢిల్లీలోని నెహ్రూ విహార్‌లో చుట్టూ ముస్లిం కుటుంబాల మధ్య ఉన్న ఓ బ్రాహ్మణ కుటుంబానికి అక్కడి వారంతా అండగా నిలిచారు. హింసకు పాల్పడుతున్న మూకలు ఎక్కడ ఆ బ్రహ్మణ కుటుంబంపై దాడి చేస్తాయోని.. అక్కడ ఉన్న ముస్లింల తామున్నామంటూ ధైర్యం చెప్పి రక్షణగా నిలిచారు. మరోవైపు యూపీలోని మీరట్‌లోనూ ఓ ముస్లిం తన కుమార్తె పెళ్లిని మత సామరస్యాన్ని చాటడానికి అవకాశంగా మలుచుకున్నాడు.

కార్డుపై రాధాకృష్ణులు, గణపతి ఫొటోలు

మీరట్‌లోని హస్తినాపూర్ ప్రాంతానికి చెందిన సరాఫత్ అనే వ్యక్తి తన కుమార్తె ఆస్మాకు మార్చి 4న నిఖా చేయాలని నిశ్చయించాడు. అయితే తన కుమార్తె పెళ్లి కార్డుపై హిందూ దేవుళ్లు రాధాకృష్ణులు, గణపతి ఫొటోలను ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఢిల్లీలో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో హిందూ – ముస్లింల మత సామరస్యాన్ని చాటడానికి ఇదే సరైన సమయం అనిపించిందని సరాఫత్ చెబుతున్నాడు. అల్లరిమూకలు కావాలని విద్వేషాలను రెచ్చగొడుతున్న సమయంలో ఐక్యతను ప్రదర్శించాలన్నాడు. ఈ కార్డులను అందుకున్న తన బంధువులు, స్నేహితులు అంతా అభినందిస్తున్నారని చెప్పాడు. తన బంధువుల కోసం ఈ కార్డులను హిందీ, ఉర్దూ భాషల్లో అచ్చువేయించానన్నాడు.

More News:

ఆరేళ్ల పాప చేతులు వెనక్కి విరిచి బేడీలు.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

ఢిల్లీ అల్లర్లలో బ్రాహ్మాణ కుటుంబానికి అండగా ముస్లింలు

Latest Updates