జపనీస్ మెచ్చిన టాలీవుడ్ స్టార్

మనసుకు నచ్చితే ఏ లాంగ్వేజ్ సినిమానయినా హిట్ చేస్తారు మన తెలుగు ప్రేక్షకులు. ఇతర భాషల నటులకు సైతం కటౌట్స్ పెట్టి క్షీరాభిషేకాలు చేస్తారు. జపాన్ వాసుల్లోనూ ఇలాంటి అభిమానమే కనిపిస్తోంది. మన టాలీవుడ్ స్టార్ ప్రభాస్​ని వాళ్లు ఇష్టపడటమే కాదు.. తన కోసం ఇండియా వచ్చేస్తున్నారు. ‘ముత్తు’ మూవీ తర్వాత రజినీకాంత్ సినిమాలకు జపాన్​లోనూ ప్రేక్షకాదరణ పెరిగినట్టు.. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ జపనీస్​కి ఫేవరేట్ హీరో అయ్యాడు. అతనికి అక్కడ ఏర్పడిన క్రేజ్ దృష్ట్యా.. ‘సాహో’ని కూడా సెలెక్టెడ్ థియేటర్స్​లో విడుదల చేశారు. ఇక తరచూ సోషల్ మీడియాలో ప్రభాస్‌పై తమ ప్రేమను చూపిస్తుంటారు జపాన్ అభిమానులు. డై హార్డ్ ఫ్యాన్స్ అయితే ఏకంగా ప్రభాస్ ఇంటి వరకూ వచ్చేస్తున్నారు. ఆమధ్య కొందరు జపాన్ అమ్మాయిలు ప్రభాస్ ఇంటి ముందు ఫొటోలు దిగి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా రినా మాట్సుయ్ అనే ఫ్యాన్.. ప్రభాస్​ని వారు ఎందుకంతలా అభిమానిస్తారో తెలియజేసింది. యాక్షన్ సీన్లతో పాటు రొమాంటిక్ సీన్స్​లో కూడా ప్రభాస్​ని వారు ఇష్టపడతారట. అతని హ్యాండ్సమ్ లుక్, గంభీరమైన వాయిస్ తమకు ఇష్టమని చెప్పింది రినా. ఇక అక్కడి వారంతా తనని ‘ప్రభాస్ సార్’ అని పిలుచుకుంటారట. మొత్తానికి ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా హీరో అయిన ప్రభాస్.. విదేశాల్లోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. మరి అతని తాజా చిత్రం ‘ఓ డియర్’ (పరిశీలనలో ఉన్న టైటిల్) కూడా జపాన్​లో కూడా విడుదలవుతుందేమో చూడాలి!

 

Latest Updates