ఇవాళ సాయంత్రం రాష్ట్ర కేబినెట్ భేటీ

  • బడ్జెట్ ను ఆమోదించనున్న మంత్రి వర్గం

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇవాళ మొదటిసారి కేబినెట్ సమావేశమవుతోంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానుంది. రేపట్నుంచి మొదలు కానున్న బడ్జెట్ సమావేశాలతో పాటు ప్రభుత్వ పథకాల అమలుపై మీటింగ్లో చర్చించనున్నారు. బడ్జెట్ పద్దులపై చర్చించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. 2017-18 కి గాను మొత్తం లక్షా 49 వేల 446 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు నాటి ఆర్థికమంత్రి ఈటల. ఈసారి రాబడులు 19 శాతం దాటటంతో.. బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటనుందని సమాచారం.

ఇక భేటీలో రాజకీయ అంశాలపై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. అసెంబ్లీలో విపక్షాలు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశాలపై మంత్రివర్గ సహచరులకు వివరించనున్నారు ముఖ్యమంత్రి. పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 34శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం కల్పించింది. అయితే అన్ని రిజర్వేషన్లు 50శాతం దాటొద్దని సుప్రీంకోర్టు ఆదేశించటంతో.. పంచాయతీ ఎన్నికలకు 50 శాతం రిజర్వేషన్లు దాటకుండా ఆర్డినెన్స్ తెచ్చింది ప్రభుత్వం. ఈ ఆర్డినెన్స్ కు చట్టరూపం కల్పించాల్సి ఉండటంతో.. పంచాయతీరాజ్ సవరణ చట్టానికి కేబినెట్ లో ఆమోదించే అవకాశం ఉంది. వ్యాట్ సవరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక రేపట్నుంచి 25 వరకు బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. రేపు ఉదయం పదకొండున్నరకు సీఎం కేసీఆర్ సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు. సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించడంతో పాటు ప్రజలకిచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా బడ్జెట్ రూపకల్పన ఉండనుంది. ఎన్నికల హామీల్లో భాగంగా పెన్షన్లను రెట్టింపు చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఏప్రిల్ నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేస్తామన్నారు. రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి 10వేలు చేశారు. వీటన్నింటికి బడ్జెట్ లో కేటాయింపులు పెంచనుంది ప్రభుత్వం.

మరోవైపు అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై రివ్యూ చేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులతో మాట్లాడారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ , డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ , శాసనసభ వ్యవహారాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. సమావేశాల్లో భద్రతా పరమైన చర్యలతో పాటు వివిధ అంశాలపై చర్చించారు. ఇక కొత్త మంత్రివర్గం ఏర్పాటు కావడంతో అసెంబ్లీ లాబీల్లో వారికి చాంబర్లను సిద్థం చేశారు. సభా వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి… అసెంబ్లీ కార్యదర్శితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు.

రేపు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనుండగా.. శనివారం బడ్జెట్ పై చర్చ జరగనుంది. ఆదివారం సెలవు ప్రకటించగా.. సోమవారం సభలో ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్నారు. ఆ తర్వాత బిల్లులకు ఆమోదం తెలపనుంది. అటు కొత్త నియమితులైన మంత్రులకు సెక్రటేరియట్ డీ బ్లాక్ లో చాంబర్లు కేటాయించారు అధికారులు.

Latest Updates