చనిపోయిన చిన్నారి అమ్మతో మాట్లాడింది

‘మీటింగ్​ యూ’ షోలో తల్లికి చేరువ చేసిన కొరియా టీవీ

చనిపోయినోళ్లను ముట్టుకుని మాట్లాడేలా వీఆర్‌‌ టెక్నాలజీ​

మనసుకు దగ్గరైనోళ్లు చనిపోతే ఉండే ఆ బాధ గురించి ఎంత చెప్పినా తీరదు. మరి, ఏమీ తెలియని వయసులో ఓ చిన్నారి చనిపోతే, ఆ ఇంట్లో తల్లిదండ్రులకు కలిగే బాధ ఇంకెలా ఉంటుంది? కడుపున పుట్టిన బిడ్డ ఇక రాదని తెలిసి, కన్నీరుమున్నీరయ్యే ఆ తల్లిదండ్రులను ఓదార్చడం కష్టం. పోయినోళ్ల జ్ఞాపకాలతో బతికేస్తుంటారు. మరి, వాళ్ల బాధను తగ్గించే మార్గం లేదా? అంటే దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ షో ఓ మంచి ఆలోచనతో ముందుకొచ్చింది. చనిపోయినోళ్లను వర్చువల్​ రియాలిటీ (వీఆర్​)తో మళ్లీ సృష్టించి, గత స్మృతులను ఆ చనిపోయినోళ్ల కుటుంబ సభ్యులకు ఇస్తోంది. ఇటీవలే ప్రారంభమైన ఆ షోలో ఓ తల్లికి అలాంటి మధురానుభూతినే మిగిల్చింది. 2016లో జబ్బుపడి చనిపోయిన తన ఏడేళ్ల కూతురును బతికించి, ఆమెతో గడిపేలా చేసింది.

మీటింగ్​ యూ

మున్వా బ్రాడ్​కాస్టింగ్​ కార్పొరేషన్​ (ఎంబీసీ) రూపునిచ్చిన ఆ షో పేరు ‘మీటింగ్​ యూ’. నేయన్​ అనే ఏడేళ్ల చిన్నారి 2016లో చనిపోయింది. అప్పటి నుంచి ఆమె తల్లి జాంగ్​ జి సుంగ్​ ఆమెనే తలచుకుంటూ బాధపడేది. ఈ నేపథ్యంలోనే ఆమె బాధను పోగొట్టాలన్న ఉద్దేశంతో నేయన్​ రూపును వీఆర్​తో సృష్టించింది ఎంబీసీ. అచ్చం నేయన్​లాగే ఆ ప్రతిరూపాన్ని తయారు చేసింది. ఆ ప్రతిరూపంతో ఆమె తల్లి మాట్లాడేలా, తాకేలా ‘వైవ్​’ అనే వీఆర్​ హెడ్​సెట్​ను ఇచ్చింది. ఆ చిన్నారిని తాకేందుకు హ్యాండ్​గ్లోవ్స్​ను అందించింది. వాటిని పెట్టుకున్న జాంగ్​, గార్డెన్​లో ఉన్న నేయన్​ ప్రతిరూపంతో ఆప్యాయంగా మాట్లాడింది. ఆమెను తాకింది. నేయన్​ ప్రతిరూపమూ ఆమె తల్లితో మాట్లాడింది. మొదట నేయన్​ ప్రతిరూపాన్ని తాకడానికి జాంగ్​ వెనకాడింది. ‘అమ్మా ఎందుకు ఆలోచిస్తున్నావ్​. నేనే నేయన్​. నన్ను పట్టుకో’ అని నేయన్​ ప్రతిరూపం అనగానే జాంగ్​ చలించిపోయింది. ‘ఐ మిస్​ యూ అమ్మ’ అని నేయన్​ అనగానే, ‘ఐ మిస్​ యూ టూ’ అంటూ జాంగ్​ కన్నీళ్లు పెట్టుకుంది. వస్తున్న ఆ కన్నీళ్లను ఆపుకోలేక, బాధను దిగమింగలేక నేయన్​ను కౌగలించుకుంది. అయితే, ఆడియన్స్​లో కూర్చుని ఆ షో చూస్తున్న నేయన్​ తండ్రి, అన్న, అక్కలూ వాళ్లిద్దరి మధ్యా జరిగిన సన్నివేశాలను చూసి ఏడ్చేశారు. ఒకానొక టైంలో నేయన్​ ప్రతిరూపం తన తల్లి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి పువ్వులిచ్చింది. ‘‘అమ్మా, నేను నిన్ను ఏం ఏడిపించట్లేదు కదా. నువ్వు ఎప్పుడూ నా గురించి బాధపడొద్దు’’ అని చెప్పింది. చివరగా, ‘‘అమ్మా, నేను బాగా అలసిపోయాను. నిద్రొస్తోంది’’ అని తల్లికి చెప్పింది. గుడ్​బై చెప్పేసింది. ఇలాంటి షోలు నాలాగే ఆప్తులను కోల్పోయిన వారికి ఎంతో ఉపశమనం కలిగే ఫీలింగ్​ను ఇస్తాయని జాంగ్​ చెప్పింది.

Latest Updates