నవంబర్ 10న మెగా ఫైనల్

న్యూఢిల్లీ : యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 13 ఫైనల్ స్టేజ్ కు దగ్గరైంది. దీంతో బీసీసీఐ చాలా రోజులుగా పెండింగ్ లో ఉంచిన ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ ను ఎట్టకేలకు ఆదివారం రిలీజ్ చేసింది. లీగ్ దశలో టాప్ –4లో నిలిచిన జట్ల మధ్య జరిగే ప్లే ఆఫ్ తోపాటు  టైటిల్ ఫైట్ జరిగే తేదీలు, వేదికలను ప్రకటించింది. దీని ప్రకారం నవంబర్ 10వ తేదీన దుబాయ్ వేదికగా ఐపీఎల్ 13 మెగా ఫైనల్ జరగనుంది. అంతకంటే ముందు.. లీగ్ స్టేజ్ లో టాప్–2లో నిలిచిన టీమ్స్ మధ్య జరిగే క్వాలిఫయర్–1 మ్యాచ్ నవంబర్ 5న దుబాయ్ లోనే జరుగుతుంది. ఎలిమినేటర్ తోపాటు క్వాలిఫయర్–2 మ్యాచ్ లకు అబుదాబి ఆతిథ్యమివ్వనుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య జరిగే ఎలిమినేటర్ పోరు నవంబర్ 6న జరగనుండగా. ఫైనల్లో ఆడే రెండో టీమ్ కోసం జరిగే క్వాలిఫయర్–2 మ్యాచ్ ఎనిమిదో తేదీన ఉంటుంది. ఈ మ్యాచులన్నీ సాయంత్రం ఏడున్నర గంటలకే మొదలవుతాయి. మెన్స్ ప్లే ఆఫ్స్ మ్యాచ్ ల మధ్యలో ఉన్న ఖాళీ రోజుల్లో మహిళల టోర్నీకి సంబంధించిన మ్యాచ్ లు నిర్వహిస్తారు. మహిళల టీ20 చాలెంజ్ మొత్తం షార్జా వేదికగానే జరుగుతుంది. నవంబర్ 4న మొదలయ్యే ఈ టోర్నీ 9న జరిగే ఫైనల్ తో ముగుస్తుంది.

Latest Updates