ఫైర్ మెన్ కు చిరంజీవి బహుమతి

Megastar chiranjeevi appreciates Fireman kranthi kumar

నిండు ప్రాణం కాపాడిన ఓ ఫైర్ మేన్ కు బహుమతి అందించి తన పెద్దమనసు చాటుకున్నారు సినీ అగ్ర నటుడు, మెగా స్టార్ చిరంజీవి. హైదరాబాద్ అకాల వర్షాల్లో బాధ్యతగా వ్యవహరించిన ఓ అగ్నిమాపక సిబ్బంది గురించి తెల్సుకుని ప్రశంసించారు.

గత రాత్రి హైదరాబాద్ నగరంలో కురిసిన అకాల వర్షానికి జనజీవనం అతలాకుతలం అయింది. భారీ వర్షాల కారణంగా పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వర్షపు నీటితో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. అధికార యంత్రాంగం ఆ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రమించింది. ఈ క్రమంలో గౌలీగూడలో  ప్రమాదవశాత్తు నాలాలో పడిపోయిన 4సంవత్సరాల దివ్యను ఆదివారం అగ్నిమాపక సిబ్బంది మృత్యువు నుండి కాపాడారు. ఈ విషయాన్ని వార్త పత్రికల ద్వారా తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి పాపను కాపాడిన ఫైర్‌మేన్‌ క్రాంతి కుమార్ ను అభినందించారు.

క్రాంతి కుమార్ కు చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు తరపున లక్ష రూపాయలు బహుమతిగా అందించారు. ట్రస్టు మేనేజింగ్ డైరెక్టర్‌ అల్లు అరవింద్ ఈ బహుమతిని అందజేశారు. క్రాంతి కుమార్ కు సహకరించిన ఫైర్ సిబ్బందినీ, గౌలిగూడ ఫైర్‌ సేషన్‌ ఆఫీసర్‌ జయరాజ్ కుమార్ ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రమాదానికి గురైన నాలుగేళ్ల బాలికను కూడా ఆదుకుంటామని అల్లు అరవింద్ గారు ఒక ప్రకటనలో తెలిపారు.

 

Latest Updates