మేఘా బ్లాస్టింగ్​ల మోత..గోడలకు నెర్రెలు,కూలుతున్న ఇండ్లు 

  • మేఘా బ్లాస్టింగ్​ల మోత  పూడుకుపోతున్న వ్యవసాయ బావులు
  • పేలుళ్ల సౌండ్స్​ను​ తట్టుకోలేకపోతున్న గ్రామస్తులు

జగిత్యాల/వెల్గటూర్, వెలుగుజగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రానికి కూతవేటు దూరంలో మేఘా కంపెనీ గుట్టలను బ్లాస్టింగ్‌‌ చేస్తోంది. పేలుళ్ల ధాటికి కిలోమీటర్ మేర రాళ్లు పడుతున్నాయి. లింక్ 2 నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు గుట్టలను పిండి చేస్తున్నారు. బ్లాస్టింగ్ నిర్వహించాలంటే రెవెన్యూ, పోలీసులు, అగ్నిమాపకశాఖ, మైనింగ్, విజిలెన్సు శాఖల నుంచి అనుమతులు తప్పనిసరి. కానీ ఎలాంటి పర్మిషన్లు లేకుండానే ప్రతిరోజు చెవులు పగిలిపోయేలా బ్లాస్టింగ్స్ ​కొనసాగిస్తున్నారు. పేలుళ్ల శబ్ధాలకు చిన్నారులు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. గ్రామానికి దగ్గరలో చేస్తున్న పేలుళ్లతో వెల్గటూర్ చుట్టుపక్కల వ్యవసాయ బోర్లు పూడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్లాస్టింగ్​తర్వాత వస్తున్న దుమ్ము ధూళి పంట పొలాలపై పడుతుండడంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని వాపోతున్నారు. పేలుళ్ల కారణంగా వెల్గటూర్, కుమ్మరిపల్లె, రాజక్కపల్లె, కోటిలింగాల, జగదేవుపేట గ్రామాల్లో వ్యవసాయ బావులు, ఇండ్లు, ప్రహరీలు దెబ్బతింటున్నాయి. పశువుల కాపరులు, రైతులు, గీత కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ పనులు చేసుకుంటున్నారు. బ్లాస్టింగ్ సైరన్ వినపడగానే పరుగులు పెడుతున్నారు.

ప్రాజెక్టుకు పర్మిషన్స్​లేకున్నా..

ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని తరలించే ఉద్దేశంతో మొదలుపెట్టిన అడిషనల్​ టీఎంసీ పనులకు ఎలాంటి పర్మిషన్లు లేవు. ఎలాంటి అనుమతులు లేకున్నా రూ. 21 వేల కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాణ పనులు చేపట్టారు. కోటిలింగాల నుంచి బూరుగుపల్లి వరద కాలువ 95వ కిలోమీటర్ వరకు కాల్వ పనులు, సుమారు రూ. 400 కోట్లతో వరద కాలువ 95 కిలోమీటర్ నుంచి 122వ కిలోమీటర్ వరకు వరద కాలువ కెపాసిటీ పెంపు పనులను మేఘా కంపెనీ దక్కించుకుంది. మిడ్ మానేర్​ నుంచి అనంతగిరి చిన్నగుండంపల్లి వరకు కేఎన్ఆర్, సీ5, ప్రతిమ, నవయుగ, ఎంఎస్ఆర్ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి. ఓవైపు భూ నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండానే మేఘా, నవయుగ,  ఎంఎస్ఆర్ కంపెనీలు పనులు కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నచ్చని రైతులు న్యాయం కోసం కోర్టుకు వెళ్తామని అంటున్నారు. ఇప్పటికే అపెక్స్ మీటింగ్ లో కేంద్ర జల వనరుల శాఖ ప్రాజెక్ట్ పనులను ఆపివేయాలని ఆదేశించినా నిర్మాణ పనులు మాత్రం ఆపడం లేదు.

Latest Updates