‘మేఘా’ గోల్డ్​ సీజ్

మేఘాలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం బాలానగర్​లోని మెయిన్​ ఆఫీస్​కు దగ్గరలోని ఆంధ్రాబ్యాంక్​లో తనిఖీలు చేసిన అధికారులు లాకర్​లోని రూ. 2.45 కోట్ల విలువైన బంగారు నగలు సీజ్​ చేశారు.

బాలానగర్​లోని ఆంధ్రాబ్యాంకు లాకర్ల తనిఖీ

రూ.2.45 కోట్ల బంగారం సీజ్ మరో 3 బ్యాంకుల్లో సోదాలు

కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు, మెయిల్ సంస్థల డైరెక్టర్ల విచారణ

‘మేఘా’కృష్ణారెడ్డి కంపెనీల లెక్కలను ఇన్​కం ట్యాక్స్​ డిపార్ట్​మెంట్ తేల్చుతోంది. బాలానగర్ లోని ఆంధ్రాబ్యాంక్ లో సోదాలు జరిపి లెక్కలు లేని రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సీజ్ చేసింది. మేఘా ఇంజనీరింగ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ అనుబంధ సంస్థల్లో ఐదు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఐటీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో శుక్రవారం నుంచి మొదలైన తనిఖీలు మంగళవారం కూడా కొనసాగాయి. బాలానగర్ లోని మెయిల్ ఆఫీసుకు దగ్గరలోని ఆంధ్రాబ్యాంక్ లో సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం రాత్రి 7.30 గంటల వరకు ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. కేంద్ర బలగాల బందోబస్తులో మెయిల్ అకౌంట్స్ పరిశీలించి లాకర్స్ లోని బంగారు ఆభరణాల వివరాలు సేకరించారు. రూ.2,45,31,160 విలువ చేసే బంగారు ఆభరణాలకు సంబంధించిన ఆధారాలు అందించకపోవడంతో బ్యాంక్ అధికారులకు నోటీసులిచ్చారు. లెక్కలు లేని ఆభరణాలను సీజ్ చేశారు.

సీజ్ చేసిన బాక్స్ పై మేఘా ఇంజనీరింగ్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్స్‌‌ లిమిటెడ్ పేరుతోపాటు వెంకట కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డి, ఫణి రెడ్డిలను పార్టీలుగా చేర్చుతూ సీల్ వేశారు. జూబ్లీహిల్స్, మాదాపూర్ కావూరి హిల్స్ లోని మరో మూడు బ్యాంకుల్లోనూ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. మేఘా కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతోపాటు మెయిల్ సంస్థల డైరెక్టర్లు, ఆడిటర్లను విచారించినట్లు తెలిసింది. మేఘా అధినేత ఇంట్లో లభించిన బ్యాంక్ డాక్యుమెంట్ల ఆధారంగా సంబంధిత బ్యాంకుల్లో మంగళవారం అకౌంట్స్ చెక్ చేశారు. ఐదు రోజులుగా జరపుతున్న తనిఖీల్లో భారీ మొత్తంలో బంగారం, నగదును సీజ్ చేసినట్లు సమాచారం. మేఘాపై ఐటీ రైడ్స్ మరో మూడు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

Latest Updates