చోక్సీ మమ్మల్నీ ముంచాడు!

న్యూఢిల్లీ: స్టేట్‌‌ బ్యాంక్‌‌, పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంక్‌‌ (పీఎన్‌‌బీ)లను రూ.వేల కోట్లకు ముంచి, ప్రస్తుతం ఆంటిగ్వాలో తలదాచుకుంటున్న నగల వ్యాపారి మెహుల్‌‌ చోక్సీ చేసిన మరో మోసం బట్టబయలైంది. ఇతడు తమను రూ.44.1 కోట్లకు మోసం చేశాడని మరో ప్రభుత్వరంగ బ్యాంకు పంజాబ్‌‌ అండ్‌‌ సింధ్‌‌ బ్యాంక్‌‌ (పీఎస్‌‌బీ) వెల్లడించింది. ఇతడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. బాకీ వసూలుకు చట్టపరమైన చర్యలు మొదలుపెట్టినట్టు ప్రకటించింది. దీంతో కలుపుకుంటే చోక్సీ మూడు ప్రభుత్వ బ్యాంకులకు టోపిపెట్టాడు. ఇతడు తమకు రూ.405 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడని గత ఏడాది స్టేట్‌‌ బ్యాంక్‌‌ తెలిపింది. తాము కూడా చోక్సీకి రూ.289 కోట్లు ఇచ్చామని గత సెప్టెంబరులో ఓబీసీ వెల్లడించింది.  చోక్సికి చెందిన కంపెనీలు గీతాంజలి జెమ్స్ రూ.136.45 కోట్లు, నక్షత్ర వరల్డ్ లిమిటెడ్  రూ.59.53 కోట్లు ఎగ్గొట్టాయని తెలిపింది. తదనంతరం ఓబీసీ పీఎన్‌‌బీలో విలీనమయింది. పీఎన్‌‌బీలో స్కాం చేసిన నీరవ్‌‌ మోడీ, మెహుల్ చోక్సిలు.. 2018 ఫిబ్రవరిలో దేశం విడిచిపారిపోయారు. ఈ స్కాం వెలుగులోకి వచ్చిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఓబీసీ వీరి అకౌంట్లను ఎన్‌‌పీఏలుగా డిక్లేర్ చేసింది.  చోక్సీ అధీనంలోని గీతాంజలి జెమ్స్‌‌, గీతాంజలి ఎక్స్‌‌పోర్ట్స్‌‌కు అప్పులు ఇచ్చామని పీఎస్‌‌బీ తెలిపింది. అతడు వీటికి డైరెక్టర్‌‌గా, గ్యారంటార్‌‌గా ఉండేవాడు. ఈ రూ.44 కోట్లను పీఎస్‌‌బీ గత ఏడాది మార్చిలోనే మొండిబాకీగా పుస్తకాల్లో రాసుకుంది.

నోటీసుకు స్పందించని చోక్సీ

తమకు రావాల్సిన అప్పునకు 2018, అక్టోబరు 23 నుంచి వడ్డీ కలిపి చెల్లించాలని పీఎస్‌‌బీ చోక్సీని అడిగినా స్పందన రాలేదు. దీంతో ఇతణ్ని గత నెల 17న ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించింది. చోక్సీ, ఇతని సమీప బంధువు నీరవ్ మోదీ పంజాబ్‌‌ నేషనల్‌‌ బ్యాంకును రూ.13,500 కోట్లకు ముంచిన సంగతి తెలిసిందే. చోక్సీ ఆంటిగ్వా, బార్బుడాలో, నీరవ్ మోడీ బ్రిటన్‌‌లో ఉంటున్నారు. ఈ ఏడాదే లండన్​ పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. ఇండియాకు అప్పగించే విషయమై ప్రస్తుతం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. చోక్సీని అప్పగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆంటిగ్వా ప్రభుత్వం ప్రకటించింది. అతడు కచ్చితంగా మోసగాడేనని ఈ దేశ ప్రధాని గ్యాస్టన్‌‌ బ్రౌన్‌‌ స్పష్టం చేశారు. అతిత్వరలోనే చోక్సీని ఇండియా పంపుతామన్నారు.

Latest Updates