రేప్‌లు జరగొద్దంటే.. మగవాళ్లు ఇలా చేయాలి!

  • మగవాడు కట్టుబాట్లు పాటించాలి
  • స్త్రీని భోగవస్తువుగా చూడటం కుసంస్కారం
  • వైరాగ్యం లేకున్నా.. సంస్కార స్పృహ ఉండాలి
  • నాడు నేడూ మన పెద్దల మాట ఇదే

స్త్రీలను చూడగానే..  వైరాగ్యంతో ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ, కనిపించిన మహిళనల్లా కామభావంతో చూడకుండాసంస్కార స్పృహతో, నాగరికత కలిగిన మనిషిగా ప్రవర్తిస్తే చాలు! మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, ఇతర రకాల హింసలకు కారణమవుతున్నది ఈ భావన లేకపోవడం వల్లే. మగవాడు చిన్న చిన్న కట్టుబాట్లు పాటించి, స్త్రీని కూడా సాటి మనిషిగా గౌరవిస్తే ఈ దురాగతాలకు ఫుల్‌స్టాప్ పడుతుందన్నది ఆధ్యాత్మిక వేత్తల మాట.

ఈ రోజుల్లో కామ, అర్థ విషయాల్లో ధర్మాన్ని పాటించకపోవడం వల్లే.. మనిషి వికృత చేష్టలకు పాల్పడుతూ, రాక్షసులకు మించి పాశవికంగా ప్రవర్తిస్తున్నాడు!! స్త్రీని భోగవస్తువుగా చూడటం కుసంస్కారం. ఆమె కూడా మనిషే. ఆమెలోనూ ఆత్మజ్యోతి ప్రకాశిస్తుంది.

మాంస వికారాలతో కూడిన దేహంపై కోరికతోనే కదా!

ఆ  యువకుడు సంపన్నుల గారాల బిడ్డ. జీవితం అంటే అతనికి వినోదం, విలాసం. యవ్వనాన్ని వెర్రెక్కించే వ్యసనాలన్నింటికీ అతడు బానిస. తల్లిదండ్రుల్లా చూసుకునే అన్నావదినల మాటలను కూడా లెక్కచేయక, ఆ వయసులోనే ఉన్న ఒక దేవదాసి పట్ల ఆకర్షితుడయ్యాడు. ఆమె చేతిలో కీలుబొమ్మగా మారిపోయి.. రేయిపగలు అక్కడే సేదతీరసాగాడు. అప్పటికే అతని డబ్బు, గౌరవం పోయాయి. తర్వాత ఆ మోహనాంగి చూపు.. ఆ యువకుడి వదిన ముక్కుపుడకపై పడింది. ‘ముచ్చటైన ఆ ముక్కెర నాకు బహుమతిగా ఇస్తేనే.. నా ఇంటి గడప తొక్కాలి’ అని బెట్టు చేసింది. ఆమె అందచందాల మాయలో పడి.. ఆమె ఆశను తన వదినముందు పెట్టాడు. మరిది మనసు మార్చడానికి అదే మంచి అవకాశం అనుకుందామె. ‘అలాగే బాబు ఇస్తాను! సాయంత్రం చీకటిపడే వేళ వచ్చి నా ముక్కెర తీసుకెళ్లు’ అని చెప్పింది.

సాయంత్రం చీకట్లు కమ్ముతున్నాయి. కొడుకుతో సమానమైన మరిదిలో మార్పు కోసం తను చేస్తున్న సాహసానికి మానసిక, నైతిక స్థైర్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకుంది. తాను అనుకున్న రీతిలో ముక్కుపుడకతో సిద్ధంగా ఉంది. అనుకున్న సమయానికి అతను ఆనందంతో వదిన గదిలోకి వెళ్లాడు. అనూహ్యంగా ఆమె వివస్త్రగా మారి మరిది కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ ‘ఇదిగో బాబు! మాంస వికారాలతో కూడిన ఈ దేహంపై కోరికతోనే కదా! ఈ ముక్కెర కావాలనుకుంటున్నది? తీసుకో..’ అని నిస్సహాయంగా నిలబడింది. ఒక్కసారిగా ఆ యువకుడి కామవాంఛలు పటాపంచలయ్యాయి. కన్నతల్లి లాంటి వదిన అలా కళ్లముందు కనిపించేసరికి తెలియని వైరాగ్య జ్వాలలు అతని మనసంతా ఆవరించాయి. ‘ఛీ! ఈ పాడు శరీరం కోసం తల్లిలాంటి వదినతో ఇంత పరీక్షకు ఒడికట్టించానా?’ అనుకున్నాడు మనసులో. మరుక్షణమే విరాగి అయి.. సత్యాన్వేషణ వైపు సాగిపోయాడు. ఆ యువకుడే యోగి వేమన!

ఈ మాట తలచుకుంటే చాలు..

ఆడవాళ్ల అందాలను చూసి మోహావేశాన్ని పొందకు. అదంతా మాంసం, కొవ్వు వంటి హేయమైన పదార్థాలతో కూడిన వికారమే. వికారాన్నే పదేపదే తలచుకుంటూ ఉండు అని చెప్పాడు ఆదిశంకరాచార్యులు. తనను ఆ అమ్మవారి ప్రియపుత్రుడిగా భావించుకొని, ఆమెను ఆరాధిస్తూ ‘సౌందర్య లహరి’ లాంటి ఎప్పటికీ నిలిచిపోయే స్తోత్రాలను ఎన్నింటినో ఆశువుగా రచించారు శంకరాచార్యులు. జగన్మాత ప్రతిరూపాలైన స్త్రీలపై నిరసనతో ఆ మాట చెప్పాడు అంటే పొరపాటు. మనిషి మనోవికారాలను ఎత్తి చూపుతూ, సాధారణంగా స్త్రీలను పురుషులు, పురుషులను స్త్రీలు చూసే కామదృష్టి గురించే ఆయన మాట్లాడాడు. మోహంతో మనం అపురూపం అనుకుంటున్న శరీరం అసలు స్వరూపమేంటో వివరించాడు. ఈ భావం మనసులో నిరంతరం పాదుకొని ఉంటే క్రూరంగా ప్రవర్తించరు.

వీడని వికారాలు..

మోహాన్ని ప్రేరేపించే ఈ అందమైన శరీరం ఎప్పటికైనా కాటిపాలు కావాల్సిందే! అయినా మనిషి ఈ అశాశ్వత శరీరం నుంచి ఏదో ఆనందాన్ని ఆస్వాదించాలని పాకులాడుతుంటాడు. శరీర సుఖాల కోసం పడరాని పాట్లు పడుతుంటాడు. మోహావేశంతో ఎంత నీచానికైనా దిగజారుతాడు.

కట్టుబాట్లు అనుసరించాల్సిందే

స్త్రీల బాహ్య సౌందర్యం చూసి మోహావేశంతో తమ కర్తవ్యాల్ని మరిచి ప్రవర్తించేవారు ఈ లోకంలో నిత్యం కనపడుతుంటారు. అరిషడ్వర్గాలలో కామం అతి ముఖ్యమైనది. మనిషి కోరికలపుట్ట. ‘స్వేచ్చా జీవిగా పుట్టిన మానవుడు ఎక్కడ చూసినా, ఎలా చూసినా సంకెళ్ళతో ఉన్నాడు’ అని అంటాడు రూసో. రాతియుగానికి ముందు అడవిలో జీవితం సాగించినప్పుడు ప్రతీ మనిషి తన కోరికలు తీర్చుకోవడానికి తన ఇష్టమొచ్చినట్టు ప్రవర్తించవచ్చేమో కానీ, సామాజిక జీవితం ప్రారంభమై, కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత మనిషి తన కోరికలను తీర్చుకోవడానికి కొన్ని నియమాలు పాటించాలి. ఎవరైనా ఈ కట్టుబాట్లని అనుసరించాల్సిందే.

కాముడిని కిరాతకుడన్న రామయ్య

శ్రీరామ చంద్రుడు కూడా యవ్వనంలో స్త్రీ వ్యామోహంపై పరమ వైరాగ్యాన్ని వ్యక్తం చేస్తూ, సభాసదుల ముందు కామప్రకోపాల గురించి ఇలా చెప్పేవాడు..‘‘కాముడనే కిరాతకుడు మోహగ్రస్తులైన నరులనే పక్షులను పట్టుకోవడానికి స్త్రీలు అనే వల పన్నుతున్నాడు”అని అంటాడు.

పతనం తప్పదు

కామప్రకోపాలను నియంత్రించుకోలేక స్త్రీల బాహ్యసౌందర్యాన్ని చూసి వ్యామోహంలో చిక్కుకుంటే మనిషికి పతనం తప్పదు. పరస్త్రీ వ్యామోహంలో పడి తమ భవిష్యత్తు నాశనం చేసుకున్నవాళ్లు గతం నుంచి నేటి వరకు చరిత్రలో చాలామంది కనబడతారు. రావణుడు చనిపోయిన తర్వాత రాముడు అలసటతో యుద్ధభూమిలో ఒక రాయిపై కూర్చుంటాడు.

సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఒక స్త్రీ రాముడు ఉన్న చోటుకి వస్తుంది. రాముడు తన వైపు నీడ రావడం చూసి ఆ నీడ తనకు తగలకుండా జరుగుతాడు. దాంతో ఆ నీడ అక్కడే ఆగి వెనక్కి వెళ్లిపోసాగింది. అది గమనించిన రాముడు ‘ఎవరది?’ అని అడుగుతాడు. “అయ్యా! నేను మండోదరిని. రావణుడి భార్యను. నా భర్త అరివీర భయంకరుడు. గొప్ప శివభక్తుడు. అలాంటి మహా శక్తివంతుడిని చంపిన వ్యక్తి ఎలా ఉంటాడో.. అతని గొప్పతనం ఏమిటో స్వయంగా తెలుసుకుందామని వచ్చాను. ఇక్కడికొచ్చాక నా భర్త బలహీనత అర్థమైంది. పరస్త్రీ నీడ కూడా మీపై సోకకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటున్నారు.  మరి నా భర్త పరస్త్రీ వ్యామోహంలో ప్రాణాల్ని, రాజ్యాన్ని కోల్పోయాడు. అదే మీ ఇద్దరిలో తేడా!’ అని చెప్పి నమస్కరించి అక్కడినుంచి వెళ్లిపోతుంది.

అమ్మా!’ అని పిలవాలి

‘‘ఎందుకు ఈ దేహంపై అంత భ్రాంతి? ఈ శరీరంలో ఏముంది? అశాశ్వతమైన పదార్థాలు, అశుద్ధాలు! అంతే కదా! ఈ దేహంలో ఆత్మస్వరూపంగా నెలకొని ఉన్న ఆ జగన్మాతను దర్శించండి. అప్పుడు కామవాసనలు అడుగంటుతాయి. పరాయి స్త్రీని సోదరిగానో, తల్లిగానో భావించుకో. అమ్మా! అన్న సంబోధనను జతచేసి మాట్లాడు. ఇంతటి సంస్కార స్పృహ మనలో కలిగినప్పుడు ఏ వికారాలూ మనల్ని విచలితులను చెయ్యలేవు’’

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌– రామకృష్ణ పరమహంస

‘‘చదువులెల్ల చదివి సర్వజ్ఞుడై యుండు

బ్రహ్మవిద్యలెల్ల పదటగలిపి

యిఱుకుయోనిజూచి పరమయోగము మాను

విశ్వదాభిరామ వినర వేమ’’

భావం: ఎన్ని చదువులు చదివినప్పటికీ, బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పటికీ స్త్రీ వ్యామోహం కలిగితే తన యోగ విద్యను విడిచిపెడతాడు.

Latest Updates