నగ్నంగా తిరుగుతుంటే ఆపాడని.. కానిస్టేబుల్ వేలు కొరికి..

విధి నిర్వహణలో ఓ పోలీస్ కానిస్టేబుల్‌ తన చేతి వేలిని పోగొట్టుకున్నాడు. రోడ్డుపై నగ్నంగా తిరుగుతూ ట్రాఫిక్ బ్లాక్ చేసిన మతిస్థిమితం లేని వ్యక్తి అడ్డుకోవడంతో అతడు వేలిని కొరికి విరిచేశాడు. అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికీ తిరిగి వేలిని అతికించడం కుదరదని డాక్టర్లు చేతులెత్తేశారు. మహారాష్ట్రలోని ముంబై నగరంలో బుధవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.

ముంబైలోని నాగ్పాడా ఏరియాలో రోడ్డుపై ఓ వ్యక్తి నగ్నంగా తిరుగుతూ వాహనాలను ఎటూ పోనీయకుండా అడ్డుపడుతున్నాడని స్థానిక పోలీస్ స్టేషన్‌కు ఫోన్ వచ్చింది. అతడిని పక్కకు జరిపి ముందుకు వెళ్లే ప్రయత్నం చేసిన వారిని నోటికొచ్చినట్లు తిట్టి.. దాడి చేస్తూ ట్రాఫిక్ అడ్డుకున్నాడని పోలీసులకు తెలిపారు. దీంతో సమీపంలో ఉన్న కానిస్టేబుల్ జనార్దన్ అక్కడికి చేరుకుని.. ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ నగ్నంగా తిరుగుతున్న వ్యక్తి అడ్డుపడుతుండడంతో ఒక చేత్తో అతడిని పట్టుకుని.. విధి నిర్వహణ చేస్తున్నాడు. ఈ సమయంలో అతడు జనార్దన్ చేతిని లాక్కొని వేలు కొరికి విరిచేశాడు. దాన్ని కింది ఉమ్మేయడంతో ఆ ముక్కను తీసుకుని.. అక్కడ ఉన్నవాళ్ల సహాయంతో జేజే హాస్పిటల్‌కు వెళ్లాడు జనార్దన్. కానీ ఆ వేలిని తిరిగి అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు చెప్పారు.

మరికొందరు పోలీసులు స్పాట్‌కి చేరుకుని.. నగ్నంగా తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతడిని మహ్మద్ షకీల్ షబీర్‌ (45) గా గుర్తించారు పోలీసులు. అతడి సోదరుడు సర్ఫరాజ్ పోలీస్ స్టేషన్‌కి చేరుకుని షకీల్‌కు మతిస్థిమితం లేదని, పూణే మెంటల్ హాస్పిటల్‌లో వైద్యం కూడా చేయిస్తున్నామని తెలిపాడు. అతడి మెడికల్ రిపోర్టులు కూడా అందజేశాడు. వాటిని పరిశీలించి.. తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Latest Updates