మెట్రోలో ప్రయాణించిన వారు 8 కోట్లు

హైదరాబాద్‌‌, వెలుగు :  ఒక్కో మైలురాయి దాటుకుంటూ  ముందుకు సాగుతున్న మెట్రో రైల్ మరో ఘనత సాధించింది. నగరంలో మెట్రోలో ప్రయాణించిన వారి సంఖ్య 8 కోట్లకు చేరింది.

మెట్రో మైలురాళ్లు

2017 నవంబర్‌‌ 28న మియాపూర్‌‌– నాగోల్‌‌ 30 కి.మీ. రూట్‌‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు.  మరుసటి రోజు  నుంచి ప్రయాణికులకు మెట్రో అందుబాటులోకి వచ్చింది.- 2018 సెప్టెంబర్‌‌ 24 న అమీర్‌‌పేట్‌‌ – ఎల్బీనగర్‌‌ 16 కి.మీ, 2019 మార్చి 20న అమీర్‌‌పేట్‌‌– హైటెక్‌‌సిటీ 10 కి.మీ మార్గాన్ని  గవర్నర్‌‌ ఈ.ఎస్‌‌.ఎల్‌‌ నరసింహన్‌‌ ప్రారంభించారు.  – ప్రస్తుతం రెండు కారిడార్లలో 56 కి.మీ మేర మెట్రో అందుబాటులోకొచ్చింది.

 ప్రయాణికుల సంఖ్య పెరిగిందిలా

– మెట్రో ప్రారంభించిన154 రోజులకు 2018 మే 1న మెట్రో కమ్యూటర్స్ సంఖ్య కోటికి చేరింది.  280 రోజులకు 2018 సెప్టెంబర్‌‌ 4 న మెట్రో ప్రయాణికుల సంఖ్య 2 కోట్లకు చేరింది. ఏడాది లోపే 351 రోజుల్లో సెప్టెంబర్‌‌ 14 న మెట్రో ప్రయాణికుల సంఖ్య 3 కోట్ల మార్కు దాటింది. – 496 రోజుల్లో 2019 మార్చి 9న మెట్రో ప్రయాణికుల సంఖ్య 5 కోట్లకు చేరింది. – పర్యావరణ దినోత్సవం జూన్‌‌ 5 నాటికి మెట్రో ప్రయాణికుల సంఖ్య 6.8  కోట్ల మార్కును చేరింది.  ఇలా 2019 జూలై 18 నాటికి మెట్రో ప్రయాణికుల సంఖ్య 8 కోట్లకు చేరినట్టు మెట్రో అధికారులు ప్రకటించారు.

సాఫీ ప్రయాణం

సగరంలో రోజుకు సగటున 2.85 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. వర్షం కురిసినప్పుడు ఈ సంఖ్య 3 లక్షలు కూడా దాటుతోంది. నిత్యం టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న వారి సంఖ్య కంటే  స్మార్ట్ కార్డ్ వినియోగిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతం సిటీలో సుమా రు 1.50 లక్షల మంది స్మార్ట్ కార్డ్ వినియోగిస్తున్నారు.

లాస్ట్ మైల్ కనెక్టివిటీ

మెట్రోలో రోజూ అమీర్ పేట్ కు లక్ష మంది వివిధ ప్రాంతాల నుంచి  వస్తున్నారు. షాపింగ్,  రెస్టారెంట్లలో భోజనం  చేయడం కోసం ఎక్కువ మంది వస్తున్నారు. మియాపూర్,  ఎల్బీనగర్ స్టేషన్లకూ ప్రయాణికుల  తాకిడి ఎక్కువగా ఉంటోంది. .

కాలుష్య రహిత ప్రయాణం

మెట్రో అన్ని రూట్లలో అందించిన సేవలు కార్లు, బైక్​లు 56 కోట్ల కిలోమీటర్ల ప్రయాణంతో సమానం. ఈ లెక్కన 1.7 కోట్ల లీటర్ల  ఇంధనాన్ని  ఆదా చేయడం ద్వారా 39,000 టన్నుల  కార్బన్ డయాక్సైడ్  విడుదలను అరికట్టారు.
12 మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్  సౌకర్యం కల్పించారు.

ఆకట్టుకునే విధానాలు

మధురానగర్ స్టేషన్ ను తరుణి స్టేషన్ గా తీర్చిదిద్దారు. మహిళలు, చిన్నారుల కోసం వివిధ స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణను కూడా మహిళలకే అప్పగించారు. ఇటీవల 60 రోజుల పాటు తరుణి ఫెయిర్ నిర్వహించారు.
తెలంగాణ గ్రామీణ కళారూపాలను ప్రదర్శించారు. చిన్నారుల  స్పోర్ట్స్ హబ్ గా మియాపూర్ స్టేషన్ ను తీర్చిదిద్దనున్నారు.  మెట్రోను మరో 10 కిలో మీటర్ల మేర విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు.  నవంబర్ నాటికి జేబీఎస్ – ఎంజీబీఎస్ రూట్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో మెట్రో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇది ఆరంభం మాత్రమే..

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపర్చడంలో మెట్రో రైల్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ దిశగా పెద్ద ఎత్తున ప్రజలు మెట్రో సాఫీ ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడంలో అనేక మైలు రాళ్ళు అధిగమిస్తోంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే.  నగర అభివృద్ధిలో మెట్రో  మరిన్ని ఘనతలు సాధించాల్సి ఉంది. హైదరాబాద్ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో మెట్రో దోహదపడుతుంది. -ఎన్వీఎస్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ

Latest Updates