మెట్రో రైళ్లలో పెప్పర్‌ స్ప్రేల అనుమతి

ప్రమాదాలను కలిగించే వస్తువులను రైళ్లలో తీసుకెళ్లడాన్ని నిషేధించింది రైల్వేశాఖ. ముఖ్యంగా మెట్రోరైల్ లో ప్రయాణించే వారు హానికర వస్తువులతో జర్నీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. దీంతో మెట్రోలో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడిని పరీక్షించి మరీ అనుమతిస్తున్నారు. అయితే షాద్‌ నగర్‌లో దిశపై జరిగిన అత్యాచారం, హత్య ఘటనల క్రమంలో హైదరాబాద్, బెంగళూరు మెట్రో కార్పోరేషన్లు కీలక నిర్ణయం తీసుకున్నాయి. మహిళల రక్షణ కోసం నిబంధనలు మార్పు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. మహిళల రక్షణ కోసం ఇక నుంచి పెప్పర్‌ స్ప్రేలను కూడా స్టేషన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించాయి. లైంగిక దాడులు, వేధింపులు ఆరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో ఉన్నతాధికారులు తెలిపారు. సాధారణంగా మెట్రోలో టెక్నికల్‌ అంశాలు పరిశీలిస్తే ఎప్పుడూ పెప్పర్‌ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్‌ స్ప్రేలతో త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అయినా మహిళలు తమ వెంట పెప్పర్‌ స్ప్రే తీసుకెళ్లోచ్చని ఆదేశాలు జారీ చేశాయి. మహిళల రక్షణ కోసం ప్రతిక్షణం నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Latest Updates