మెట్రో రైల్: హైటెక్ సిటీ రూట్ లో ట్రయిల్ రన్

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ లో.. హైటెక్ సిటి మార్గం కీలకంగా మారింది. ఈ నెలాఖరుకు ఈ రూట్ లో మెట్రోను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. డైలీ మెట్రో  రైళ్లకు టెస్ట్ లతో ట్రయిల్ రన్స్ నిర్వహిస్తున్నారు. స్టేషన్స్, ఫుట్ పాత్ పనులు ఫైనల్ స్టేజ్ కి చేరుకున్నాయి. ప్రారంభోత్సవానికి సీఎం అపాయింట్ మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మెట్రో  అధికారులు.

అమీర్ పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలును ఈ నెలాఖరు నుంచి నడిపే అవకాశం కనిపిస్తోంది. ట్రయిల్ రన్ చివరి దశకు చేరుకోవడంతో భద్రతాపరమైన తనిఖీలు చేపట్టాలని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీని ఎల్ అండ్ టీ కోరింది. ఇప్పటికే ప్రారంభమైన ఎల్బీ నగర్–మియాపూర్, నాగోల్-అమీర్ పేట మార్గాలతో పోలిస్తే హైటెక్ సిటీ మార్గం కొంచె కష్టమైంది కావడంతో CMRS అధికారులు మరింత క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

ప్రారంభానికి టైం దగ్గర పడుతుండటంతో డైలీ ట్రయిల్ రన్స్ కొనసాగుతున్నాయి. చివరి స్టేషన్ హైటెక్ సిటీలో రివర్సల్ లేకపోవడంతో ట్విన్ సింగిల్ విధానంలో రైళ్లు నడుపుతున్నారు. అనుకున్న ప్రకారం ఇప్పటికే ట్రయిల్ రన్ నిర్వహించినప్పటికీ… ప్రారంభోత్సవం వరకు ఇవి కొనసాగిస్తామంటున్నారు అధికారులు.

హైటెక్ సిటీతో మెట్రో రైలు అనుసంధానం మెట్రో ప్రాజెక్టుకే లైఫ్ లైన్ కానుంది. ఇక్కడి నుంచి ఒకేసారి మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణం చేసే అవకాశం త్వరలోనే కలగనుంది. మాదాపూర్ హైటెక్ సిటీ కేంద్రంగా ఐటీ కారిడార్ కు నిత్యం లక్షల మంది ఉద్యోగులు రాకపోకలు సాగిస్తుంటారు. వారి అవసరాలకు సరిపడా ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో ప్రస్తుతం ప్రైవేట్ వాహనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. దాంతొ ఈ ప్రాంతంలో ట్రాఫిక్  సమస్య ఎక్కువగా ఉంటోంది.

పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నుంచి బయట పడాలంటే.. రోడ్ ప్రయాణం కన్నా మెట్రో రైల్ జర్నీ బెస్ట్ అంటున్నారు నగరవాసులు. త్వరలో ప్రారంభమయ్యే హైటెక్ సిటీ మెట్రోతో ఐటీ, సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ట్రాఫిక్ నుంచి రిలీఫ్ దొరకనుంది.

Latest Updates