ఆదాయం పెంచుకున్న MGBS

రాష్ట్రంలో అతిపెద్ద బస్టాండ్ MGBS. రోజూ లక్ష మంది ఇక్కడి నుంచి జిల్లాలకు ప్రయాణం చేస్తారు. MGBS అనగానే ఒకప్పుడు చెత్తాచెదారం గుర్తుచ్చేది. కానీ ఇపుడా పరిస్థితిలేదు. ప్రయాణీకుల కోసం సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. అంతేకాదు కమర్షియల్ గా రెవెన్యూ కూడా పెంచుకున్నారు.

ప్రయాణీకుల అభిప్రాయాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బస్టాండ్లను ఆధునీకరిస్తున్నారు ఆర్టీసి అధికారులు. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే పెద్ద బస్టాండ్ గా పేరున్న MGBSను ఆధునీకరించారు. దీంతో ప్రయాణీకులకు మంచి సౌకర్యాలు కల్పించడంతో పాటు కమర్షియల్ స్టాల్స్ తో వచ్చే ఆదాయం కూడా పెంచుకోగలిగారు.

మహాత్మాగాందీ బస్ స్టేషన్ నుంచి రాష్ట్రంలోని జిల్లాలకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా బస్సులు వెళ్తుంటాయి. నిత్యం 3500 బస్సులతో పాటు లక్షమందికి పైగా ప్రయాణీకులు ఇక్కడి నుంచి వెళ్తారు. గతంలో ఈ బస్టాండ్ మొత్తం దుమ్ముధూళి, చెత్త చెదారంతో కనిపించేది. కానీ ప్రస్తుతం దీని రూపురేఖలు మార్చేశారు ఆర్టీసీ అధికారులు.

నష్టాలతో ఉన్న ఆర్టీసీ..ఆదాయ మార్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. MGBSలో ప్రస్తుతం వంద కమర్షియల్ స్టాల్స్ ఉన్నాయి. ఆధునీకరణ తరువాత కమర్షియల్ స్టాల్స్ ద్వారా వచ్చే రెవెన్యూ కూడా పెరిగిందని చెబుతున్నారు ఆర్టీసీ అధికారులు. మల్టీ లెవెల్ పార్కింగ్ తో పాటు మినీ థియేటర్ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు.

MGBSలో బస్ కోసం ఎదురుచూసే టైంలో బోర్ కొట్టకుండా 76 ఎల్ఈడీ స్క్రీన్స్ తో పాటు 4 పెద్ద స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. నిత్యం ప్రయాణీకుల రద్దీగా ఉండటంతో పాటు నిఘా నీడలో ఉంచేందుకు 128 సీసీ కెమెరాలు పెట్టారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటలు వీటిని మానిటర్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు ప్రయాణీకులకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. 24 గంటలు నిఘా నీడలో ఎంజిబిఎస్ ఉంటుందని..చిన్నపాటి దొంగతనం జరిగినా వెంటనే పట్టుకుంటున్నామని చెబుతున్నారు. ఎక్కువగా సెల్ ఫోన్ చోరీలే జరుగుతున్నాయని అంటున్నారు. ఆధునీకరణ బాగానే ఉన్నా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా.. ఎంజీబీఎస్ లో సెక్యూరిటీ అంతంత మాత్రమే అంటున్నారు ప్రయాణీకులు. సెక్యూరిటీపై మరింత దృష్టి పెట్టాలని కోరుతున్నారు.

Latest Updates