MI vs PBKS: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై

MI vs PBKS: ఐపీఎల్‌లో మరో ఉత్కంఠ పోరు.. తృటిలో గట్టెక్కిన ముంబై

ఎదుట 193 పరుగుల భారీ లక్ష్యం.. ప్రత్యర్థి జట్టులో ప్రమాదకర బుమ్రా.. ఛేదనలో 49 పరుగులకే 5 వికెట్లు. అలాంటిది ఇద్దరు పంజాబ్ కింగ్స్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు తమ అసమాన పోరాటంతో హార్దిక్ సేనను వణికించారు. ఫైనల్‌గా మ్యాచ్‌లో విజయం సాధించింది ముంబై జట్టైనా.. అభిమానుల మనసులు గెలుచుకుంది మాత్రం.. పంజాబే. మొదట ముంబై ఇండియన్స్ 192 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో పంజాబ్ కింగ్స్ 183 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. ఫలితంగా, హార్దిక్ సేన 9 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.

భారీ ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆదిలోనే తడబడింది. ముంబై పేసర్లు గెరాల్డ్ కొయెట్జీ, జస్ప్రీత్ బుమ్రాలు నిప్పులు చెరగ‌డంతో 49 ప‌రుగుల‌కే 5 వికెట్లు కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (0), రిలీ రొసోవ్ (1), సామ్ కరన్ (6), లివింగ్‌స్టన్ (1), హర్‌ప్రీత్ సింగ్ భాటియా(13) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. దీంతో పంజాబ్ భారీ తేడాతో ఓటమిపాలయ్యేలా కనిపించింది. ఆ సమయంలో శశాంక్ సింగ్(41; 25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) తన సత్తా ఏంటో మరోసారి చూపెట్టాడు. ముంబై బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. దీంతో పంజాబ్ మరోసారి రేసులో నిలబడింది.

బుమ్రా వచ్చాడు.. వికెట్ తీశాడు 

అలాంటి సమయంలో బంతి చేతికందుకున్న బుమ్రా.. వచ్చిరాగానే  శశాంక్ సింగ్‌ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 111 పరుగుల వద్ద పంజాబ్ ఏడో వికెట్ కోల్పోయింది. అక్కడినుంచి ఆ బాధ్యతలు అశుతోష్ శర్మ(61; 28 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు) అందుకున్నాడు. మరో ఎండ్‌లో బ్యాటర్లు వీడుతున్నా.. తాను మాత్రం పోరాటాన్ని ఆపలేదు. కొయెట్జీ వేసిన 15 ఓవర్‌లో 13 పరుగులు.. ఆకాశ్‌ మధ్వాల్ వేసిన 16 ఓవర్‌లో 24 పరుగులు.. ఇలా వీలు చిక్కినప్పుడల్లా పరుగుల వరద పారించాడు.

విజయానికి చివరి 24 బంతుల్లో 28 పరుగులు

16 ఓవర్లకు పంజాబ్ స్కోర్.. 165. విజ‌యానికి చివరి 24 బంతుల్లో 28 పరుగులు అవసరమయ్యాయి. బంతి అందుకున్న బుమ్రా.. 17వ ఓవర్ లో 3 పరుగులిచ్చాడు. అనంతరం కొయెట్జీ.. డేంజ‌రస్ అశుతోష్‌ను వెన‌క్కి పంపి ముంబైని పోటీలోకి తెచ్చాడు. ఆ కాసేప‌టికే బ్రార్ సైతం వెనుదిర‌గ‌డంతో పంజాబ్ ఓట‌మి ఖాయమైంది. ఈ విజయంతో ముంబై ప్లేఆఫ్స్ రేసులో నిలబడింది.

సూరీడి మెరుపులు

అంతకుముందు పంజాబ్ గ‌డ్డపై ముంబై బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. సూర్య కుమార్ యాద‌వ్(78; 53 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచ‌రీతో కదం తొక్కగా.. రోహిత్ శర్మ(25 బంతుల్లో 36), తిలక్ వర్మ(18 బంతుల్లో 34 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో హోరెత్తించారు. దీంతో ముంబై నిర్ణీత ఓవ‌ర్లలో 7 వికెట్ల న‌ష్టానికి 192 పరుగులు చేసింది.