మైక్రోసాఫ్ట్‌‌ 70 లక్షల కోట్లు

టెక్నాలజీ ప్రపంచంలో ముప్ఫై ఏళ్లుగా రారాజుగా వెలుగొందుతున్న మైక్రోసాఫ్ట్‌‌ మార్కెట్‌‌ కాపిలైజేషన్‌‌ జూన్‌‌ 7న ట్రిలియన్‌‌ డాలర్ల (రూ.70 లక్షల కోట్లు) మైలురాయిని అందుకుంది. అమెరికాలోనే అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌‌ అవతరించడంలో కీలకపాత్ర నిర్వహిస్తున్న సీఈఓ సత్య నాదెళ్ల మన తెలుగువాడు కావడం  గర్వకారణం. మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ పరంగా ఇప్పుడు అమెజాన్‌‌ రెండో ప్లేస్‌‌, యాపిల్‌‌ మూడో ప్లేస్‌‌లోనూ ఉన్నాయి. ఈ రెండు కంపెనీల మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ దాదాపు 880 బిలియన్‌‌ డాలర్ల (దాదాపు రూ. 62 లక్షల కోట్లు) స్థాయిలో ఉంది. జూన్‌‌ 7 కు నాలుగు రోజుల ముందు నుంచీ మైక్రోసాఫ్ట్‌‌ షేర్‌‌ ధర సుమారు 10 శాతం పెరిగింది.

మైక్రోసాఫ్ట్‌‌ క్లౌడ్‌‌ సర్వీసెస్‌‌కు మంచి భవిష్యత్‌‌ ఉంటుందనే ఇన్వెస్టర్ల నమ్మకంతోనే మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ భారీగా పెరిగిందని ఎనలిస్టులు చెబుతున్నారు. క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలోనే  సీఈఓగా బాధ్యతలు చేపట్టిన సత్య నాదెళ్ల తనదైన రీతిలో మైక్రోసాఫ్ట్‌‌ను అప్పటి నుంచీ కొత్త పుంతలు తొక్కించారు. మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ గురించి మాట్లాడేందుకు సత్య అంత ఆసక్తి చూపించరు. సెలిబ్రేట్‌‌ చేసుకోరు. మార్కెట్‌‌ కాపిటలైజేషన్‌‌ కోసం సెలిబ్రేట్‌‌ చేసుకోవడం అర్ధవంతమైనది కాదని ఇంతకు ముందే ఒక ఇంటర్వ్యూలో సత్య వెల్లడించారు.

సత్య 2014 ఫిబ్రవరిలో సీఈఓ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటికే మైక్రోసాఫ్ట్‌‌ మొబైల్‌‌ ఫోన్‌‌ బూమ్‌‌ మిస్సవడం, గూగుల్‌‌ సెర్చ్‌‌ ఇంజిన్‌‌కు ధీటైన సెర్చ్‌‌ ఇంజిన్‌‌ తేలేకపోవడం, సోషల్‌‌ నెట్‌‌వర్కింగ్‌‌ను పక్కన పెట్టడం వంటి కారణాలతో ఇబ్బందులలో పడింది. ఎప్పటి నుంచో వున్న విండోస్‌‌ ఆపరేటింగ్‌‌ సిస్టమ్‌‌, ఆఫీస్‌‌ సాఫ్ట్‌‌వేర్‌‌ల భవిష్యత్‌‌ పట్ల అంతగా క్లారిటీ లేదు. అప్పటి నుంచీ సత్య నాదెళ్ల నాయకత్వంలో మళ్లీ కంపెనీ పనితీరు బాగా మెరుగుపడింది. ముఖ్యంగా క్లౌడ్‌‌ కంప్యూటింగ్‌‌పై సత్య ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. దీంతో అమెజాన్‌‌ వెబ్‌‌ సర్వీసెస్‌‌కు సరైన ప్రత్యామ్నాయంగా మైక్రోసాఫ్ట్‌‌ అజూర్‌‌ను తెచ్చారు. ఫలితంగా గ్లోబల్‌‌ క్లౌడ్‌‌ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌ మార్కెట్లో 2018 లో మైక్రోసాఫ్ట్‌‌ 17 శాతం వాటా అందుకోగలిగింది. ఈ మార్కెట్లో అమెజాన్‌‌ వెబ్‌‌ సర్వీసెస్‌‌కు 32 శాతం వాటా ఉందని రిసెర్చ్‌‌ సంస్థ కానలిస్‌‌ వెల్లడించింది

Latest Updates