మైక్రోసాఫ్ట్​ @ రూ.70 లక్షల కోట్లు

7,02,01,30,00,00,000.. అక్షరాలా రూ.70 లక్షల కోట్ల పైమాటే! సాఫ్ట్​వేర్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ మార్కెట్​ విలువ ఇది. డాలర్లలో చెప్పుకుంటే లక్ష కోట్ల డాలర్లు దాటింది. తాజా త్రైమాసిక ఫలితాలు సానుకూలంగా రావడం,  లాభాల బాట పట్టడంతో గురువారం కంపెనీ షేర్లు దూసుకుపోయాయి. ఆ వెంటనే సంస్థ మార్కెట్​ విలువ రూ.70లక్షల కోట్లు దాటింది. తద్వారా లక్ష కోట్ల డాలర్ల మార్కెట్ ​కలిగిన మూడో కంపెనీగా మైక్రోసాఫ్ట్​ నిలిచింది. దాని కన్నా ముందు యాపిల్​, అమెజాన్​లున్నాయి. గత ఏడాది నాలుగో త్రైమాసికానికి సంస్థ రెవెన్యూ 14 శాతం పెరిగిందని బుధవారం సంస్థ ప్రకటించిం ది. నికర లాభాలు 19 శాతం పెరిగాయని చెప్పింది.

సంస్థ సీఈవో సత్య నాదెళ్ల సారథ్యంలోనే సంస్థ ఇంతటి ఘనత సాధించిందని నిపుణులు చెబుతున్నారు. విండోస్​ ఆపరేటింగ్ సిస్టమ్ పైనే కంపెనీ ఆధారపడడాన్ని తగ్గించేందుకు ఐదేళ్లుగా ఆయన కృషి చేస్తున్నారు. ఇక, విశ్లేషకులూ మైక్రోసాఫ్ట్‌‌ అజ్యూర్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌‌ బిజినెస్‌ దూసుకుపోతుండడంతో ఈసారి ఫలితాలు బాగుంటాయని ముందుగానే అంచనా వేశారు. కంపెనీ ఎదుగుదలకు మరిన్ని అవకాశాలు ఉన్నాయని యూబీఎస్ సంస్థ విశ్లేషించింది. మైక్రోసాఫ్ట్​ స్టాక్​ను కొనాలని గోల్డ్​మన్​ సాక్స్​ సిఫార్సు చేసింది. టార్గెట్​ ప్రైస్​ను 131డాలర్ల నుంచి 144 డాలర్లకు పెంచింది. మిగతాబ్రోకింగ్‌‌ సంస్థలూ దాని బాటలోనే నడిచాయి.

Latest Updates