అర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. తల్లీకూతుళ్లపై కత్తితో దాడి

పెద్దపల్లి జిల్లా: అర్ధరాత్రి వేళ ఇంట్లో చొరబడి ముగ్గురు మహిళలపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడో ఆగంతకుడు. తల్లీకూతుళ్ల తప్ప ఎవరూ లేని సమయం చూసి విచక్షణా రహితంగా నరికే ప్రయత్నం చేశాడు. క్షణాల్లో అప్రమత్తం కావడంతో తీవ్ర గాయాలైనా ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లాలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.

జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ లో నాగమణి తన ఇద్దరు కూతుళ్లతో నివాసం ఉంటుంది. వారు తప్ప ఇంట్లో ఎవరూ లేని టైం చూసి ఓ ఆగంతకుడు ముఖానికి ముసుగు వేసుకుని లోపలికి చొరబడ్డాడు. వారంతా టీవీ చూస్తుండడంతో అతడి రాకను తొలుత గుర్తించలేకపోయారు. మెల్లగా దగ్గరికొచ్చి నరికే ప్రయత్నం చేసిన సమయంలో వెనుక నుంచి అలికిడి కావడంతో క్షణాల్లో తేరుకుని కత్తి వేటు నుంచి తప్పించుకున్నారు. పరుగు పరుగున ఇంటి బయటకు వెళ్లారు. వారిని వెంబడిచిన దుండగుడు అప్పటికే నాగమణి, ఆమె పెద్ద కూతురు స్వరూపలపై కత్తితో దాడి చేశాడు. స్వరూపకు తలపై, నాగమణికి చేతిపై తీవ్ర గాయాలయ్యాయి.

వారు రోడ్డు పైకి వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. దీంతో ఆ దుర్మార్గుడు పరారయ్యాడు. గాయపడిన వారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటన పై ఆరాతీశారు. ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులను డీసీపీ సుదర్శన్ గౌడ్ పరామర్శించారు. ఈ ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాయపడ్డ మహిళకు ప్రాణాపాయం ఏమి లేదని, ఈ ఘటన పై పూర్తి విచారణ జరిపుతామని పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదాల కారణంగానే వారిపై ఈ దాడి జరిగి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.

Latest Updates