రివ్యూ: మిడిల్ క్లాస్ మెలోడీస్

రన్ టైమ్: 2 గంటల 15 నిమిషాలు

నటీనటులు: ఆనంద్ దేవరకొండ,వర్ష బొల్లమ్మ,తరుణ్ భాస్కర్,గోపరాజు రమణ,దివ్య శ్రీపాద తదితరులు

సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి

మ్యూజిక్: స్వీకార్ అగస్తి

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

కథ,మాటలు: జనార్థన్ పసుమర్తి

నిర్మాత: వి.ఆనంద్ ప్రసాద్

రచన,దర్శకత్వం: వినోద్ అనంతోజు

రిలీజ్ డేట్: నవంబర్ 20,2020

కథేంటి?

రాఘవ (ఆనంద్ దేవరకొండ) తన తండ్రి కొండల్ రావు (గోపరాజు రమణ) గుంటూరు టౌన్ పక్కన చిన్న విలేజ్ లో పెట్టిన హోటల్ నడుపుతుంటాడు. కానీ అతనకి మాత్రం టౌన్ కి వెళ్లి సొంతగా హోటల్ పెట్టి ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటాడు.ఆ ప్రయత్నాలు చేస్తుంటాడు.తను ప్రేమించిన మరదలు సంధ్య (వర్ష బొల్లమ్మ) ను పెళ్లి చేసుకుందామని ఉన్నా..హోటల్ బాగా సక్సెస్ అయ్యాకే చేసుకోవాలనుకుంటాడు.మొదట్లో త్రండ్రికి ఇష్టం లేకపోయినా తర్వాత పొలం అమ్మి డబ్బులిస్తాడు.ఇన్ని ఇబ్బందులు పడి పెట్టిన హోటల్ ఎలా సాగింది.చివరికి రాఘవ ,సంధ్య ల పెళ్లి జరిగిందా లేదా అనేది మూవీ చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:

హీరో ఆనంద్ దేవరకొండ మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్రలో ఒదిగిపోయి నటించాడు.మొదటి సినిమా కంటే నటనలో మెరుగయ్యాడు.హీరోయిన్ వర్ష బొల్లమ్మ అభినయంతో ఆకట్టుకుంది.హీరోహీరోయిన్ల జోడీ బాగుంది.తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ అందరినీ ఆకట్టుకుంటాడు.మిడిల్ క్లాప్ ఫాదర్ ఎలా ఉంటాడో అంత సహజంగా నటించి మెప్పించాడు.ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన చైతన్య, దివ్య శ్రీపాద ,హీరో మదర్,హీరోయిన్ ఫాదర్ అందరూ రాణించారు.తరుణ్ భాస్కర్ చిన్న పాత్రలో మెరిసాడు.

టెక్నికల్ వర్క్:

టెక్నీషియన్లలో ముఖ్యంగ చెప్పుకోవాల్సింది మ్యూజిక్ డైరెక్టర్ స్వీకార్ అగస్తి గురించి.‘‘కేరాఫ్ కంచెరపాలెం’’ తర్వాత మరోసారి ఈ మూవీలో మంచి మ్యూజిక్ తో ఆకట్టుకున్నాడు.బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్ ను క్యారీ చేసింది.సన్నీ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది.గుంటూరు లొకేషన్లను బాగా తెరకెక్కించాడు.ఎడిటర్ పనితనం బాగుంది.క్లైమాక్స్ లో కొంత ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది.జనార్థన్ డైలాగులు సహజంగా బాగున్నాయి.

విశ్లేషణ:

‘‘మిడిల్ క్లాస్ మెలొడీస్’’ సింపుల్ గా సాగే మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.మిడిల్ క్లాస్ జీవితాల్లో సాగే చిన్న చిన్న సంఘటనలను ఇతివృత్తం గా చేసుకుని కొత్త దర్శకుడు వినోద్ అనంతోజు ఈ మూవీని తెరకెక్కించిన విధానం ఆకట్టుకుంటుంది.అక్కడే అందరూ కనెక్టవుతారు.గుంటూరులో సాగే ఈ కథతో, ఆ క్యారెక్టర్లతో మనందరం ఓ రెండు గంటలు ట్రావెల్ చేస్తాం. హీరో హీరోయిన్ తప్ప దాదాపు అందరూ కొత్త మొఖాలే.కానీ వాళ్ల నుండి డైరెక్టర్ రాబట్టుకున్న పనితనం సూపర్బ్.సినిమా మొదలైనప్పటి ఫస్ట్ సీన్ నుంచే డైరెక్టర్ తన మార్కు చూపించాడు.మిడిల్ క్లాస్ వాళ్లు ఎలా మాట్లాడతారు,చిన్న చిన్న వాటికి ఎలా రియాక్ట్ అవుతారు అనేది దర్శకుడు చక్కగా క్యాచ్ చేశాడు.ఇక గుంటూరు నేటీవిటీని చక్కగా,సహజంగా చూపించాడు.ఈ మధ్య అందరినీ ఆకట్టుకుంటున్న మలయాళ సినిమాల కోవలో ‘‘మిడిల్ క్లాస్ మెలొడీస్’’ చేరుతుంది.అంత నేచరుల్ గా ఉంటుంది మూవీ.ఫస్టాఫ్ సూపర్ ఫన్ గా సాగిపోతుంది.సెకండాఫ్ ప్రీ క్లైమాక్స్ లో కాస్త డ్రాగ్ అనిపించినా ఓవరాల్ గా మూవీ అందరికీ నచ్చుతుంది. ఓటీటీ ప్లాట్ ఫామ్ కు సరిగ్గా సరిపోయే సినిమా ఇది.ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్ చేయవచ్చు.

రివ్యూ: మెలోడీ బాగుంది.

Latest Updates