శ్రామిక్ రైళ్ల ఆలస్యం.. వలస కూలీల ఆగ్రహం

లక్నో: శ్రామిక్ రైళ్ల ఆలస్యంపై పలు చోట్ల వలస కూలీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈస్టర్న్ ఉత్తర ప్రదేశ్, బిహార్ కు వెళ్లాల్సిన రైళ్లు చాలా ఆలస్యంగా వస్తున్నాయని, ఆ ట్రెయిన్స్ లో అపరిశుభ్ర పరిస్థితులు ఉన్నాయని మైగ్రంట్ వర్కర్స్ వాపోయారు. తమకు కుళ్లిన భోజనం వడ్డించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి బిహార్ కు వెళ్లిన ఓ శ్రామిక్ ట్రెయిన్ లోని వలస కూలీలు రైల్వే ట్రాక్స్ ను బ్లాక్ చేశారు. పది గంటలకు పైగా ప్రయాణం చేస్తున్నామని తమకు ఇంకా భోజనం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

‘ఈ ట్రెయిన్ నిన్న రాత్రి 11 గంటలకు ఇక్కడకు వచ్చింది. అప్పటినుంచి ఇప్పటిదాకా అలాగే నిలబడి ఉంది. గత రెండ్రోజులుగా మాకు ఆహారం పెట్టలేదు. ఈ ప్రయాణానికి రూ.1,500 చెల్లించాల్సిందిగా మాపై ఒత్తిడి తీసుకొచ్చారు’ అని ధిరెన్ రాయ్ అనే ఓ వలస కూలీ ఫిర్యాదు చేశాడు. మహారాష్ట్రలోని పన్వెల్ నుంచి యూపీలోని జౌన్ పూర్ కు వెళ్తున్న మరో రైలు వారణాసి దగ్గర 10 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ రైలులోని వలస కూలీలు ట్రాక్ లపై విరుచుకుపడ్డారు. వాళ్లను తరలించడానికి ఇంకో ట్రెయిన్ వచ్చినా దాంట్లో వెళ్లడానికి నిరాకరించారు. రైల్వే పోలీసులు జోక్యం చేసుకొని అందరికీ భోజనం అందించడంతో గొడవ సద్దుగమణిగింది. ఆ తర్వాత రైలు తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది. లాక్ డౌన్ కారణంగా సుమారు 18.24 లక్షల మంది కార్మికులు ఉత్తర్ ప్రదేశ్ కు తిరిగొచ్చారని.. వారిలో 12.33 లక్షల మంది 930 రైళ్ల ద్వారా చేరుకున్నారని యూపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ అవనీశ్ అవస్తీ చెప్పారు.

Latest Updates