టీఆర్ఎస్ ​కబ్జా చేసిన భూములతో లక్షల ఇండ్లివ్వొచ్చు

ఇండ్లు కట్టడానికి కేంద్రం ఇచ్చే పైసలు పక్కదారి
డబుల్ బెడ్ రూంలు ఇవ్వకపోతే కలెక్టరేట్ ముట్టడి
పట్నం గోస కార్యక్రమంలో ఎంపీ రేవంత్ రెడ్డి

హయత్ నగర్, వెలుగు: ప్రభుత్వం, టీఆర్​ఎస్​ నాయకులు కబ్జా చేసిన భూములతో 10లక్షల మందికి డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇవ్వొచ్చని కాంగ్రెస్​ నేత, మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్​రెడ్డి అన్నారు. పట్నంగోస పేరుతో ఎంపీ రేవంత్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమం   మంగళవారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నిర్వహించారు. వనస్థలిపురం, మన్సూరాబాద్​, నాగోల్​, హయత్​నగర్​ లలో డబుల్​ బెడ్​రూం ఇండ్లను పరిశీలించి మాట్లాడారు.  డబుల్ బెడ్​రూం ఇండ్లు పూర్తి కాకపోవడానికి కారణం టీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వ అవినీతే కారణమని, ప్రధాన మంత్రి ఆవాస్​యోజన పేరుతో కేంద్రం ఇస్తున్న వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని ఆరోపించారు. గల్లీల్లో ఉండే టీ‌‌ఆర్‌‌ఎస్ నాయకులు ఈ పథకం పేరిట పైసలు వసూలు చేస్తున్నారన్నారు. అప్లై చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారో తెలియకుండా  చేసేందుకే మీసేవలో దరఖాస్తులు పెట్టుకోవాలని చెబుతున్నారన్నారు. తహసీల్దార్​ ఆఫీసుల కాడ అప్లికేషన్లు తీసుకుంటున్నమని చెప్తే నిజమైన లబ్ధిదారులు ఎంత మంది క్యూలో ఉంటారో కనబడుతారన్నారు. మన్సూరాబాద్​లో 154మందికి డబుల్ బెడ్​రూంలు కేటాయించి మళ్ళీ తాళాలు గుంజుకున్నారని. ఎందుకని అడిగితే కేటీ‌‌ఆర్ సార్​ వచ్చి ఓపెన్​ చేస్తారని చెబుతున్నారన్నారు. లబ్ధిదారులకు న్యాయం జరగకపోతే అందరితో కలెక్టరేట్​ముట్టడిస్తామన్నారు. ఎన్నిరోజులైనా అక్కడే ఉంటామని, అన్నం తిన్న ఆకులను కలెక్టర్​ కుర్చీలో పెట్టి నిరసన తెలుపుతామన్నారు.

ప్రజల నమ్మకాన్ని మూసీలో కలిపిన సుధీర్​రెడ్డి

ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రిజిస్ట్రేషన్ ప్రాబ్లమ్స్​, ఇంటి పన్నులు, ఆటో నగర్ చెత్త డంపింగ్ సమస్య లాంటి ప్రధాన సమస్యలు పరిష్కరించేందుకే తాను టీఆర్​ఎస్​లో చేరుతున్నానని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చెప్పారని, 6 నెలల్లో సమస్యలను పరిష్కరించకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారన్నారు. కానీ 8 నెలలు కావస్తున్నా ఏమీ చేయకుండా ప్రజల నమ్మకాన్ని మూసీలో కలిపి మూసీ రివర్​ కార్పొరేషన్​ చైర్మన్​పదవి తెచ్చుకున్నారన్నారు. ఎమ్మెల్యే కు చిత్తశుద్ది ఉంటే హామీలు తీర్చి పదవి చేపట్టాలన్నారు. బస్తీ నుంచి మొదలు ప్రతి డివిజన్​లో ఎమ్మెల్యే చేసిన మోసం గురించి వివరిస్తామన్నారు. పట్నం గోసలో తన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తానన్నారు. హయత్ నగర్, మన్సూరాబాద్, వనస్థలిపురం ప్రాంతాల్లో పేదలు, డబుల్ బెడ్​రూం లబ్ధిదారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

Latest Updates