పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌‌‌‌‌‌‌‌దే

పాతబస్తీ మళ్లీ మజ్లిస్‌‌‌‌‌‌‌‌దే
  • వరుసగా ఐదోసారి విజయం సాధించిన అసదుద్దీన్​ ఒవైసీ
  • 1984 నుంచి 2024 వరకు గెలుస్తున్న ఎంఐఎం
  • 2024 ఎన్నికల్లో రెండో స్థానానికి పరిమితమైన బీజేపీ

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పాతబస్తీలో మజ్లిస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ ఎంపీ స్థానం నుంచి వరుసగా ఐదోసారి విజయం సాధించారు. మంగళవారం ప్రకటించిన లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల ఫలితాల్లో హైదరాబాద్ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో అసదుద్దీన్ తన సమీప బీజేపీ అభ్యర్థి మాధవీ లత పై 3,38,087(61.8%) ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కాగా, పాతబస్తీలో మజ్లిస్ పార్టీ దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా పాగా వేసింది. 1984 మొదలుకొని 2024 వరకు ఆ పార్టీ గెలుస్తూ వస్తోంది.

1984లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ స్థానం నుంచి మొదట ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒవైసీ పోటీ చేసి గెలిచారు. తర్వాత 1989లో జరిగిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో ఆలిం డియా మజ్లిస్‌‌‌‌‌‌‌‌ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్‌‌‌‌‌‌‌‌ (ఎఐఎంఐఎం)ను ఏర్పాటు చేసి, ఆ పార్టీ తరఫున సలావుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ పోటీ చేసి విజయం సాధించారు. 1991, 1996, 1998, 1999లో జరిగిన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లోనూ సలావుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ బీజేపీ అభ్యర్థులపై గెలిచారు.

అనంతరం 2004 పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ ఎన్నికల్లో అసదుద్దీన్‌‌‌‌‌‌‌‌ ఒవైసీ మొదటిసారి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వరుసగా 2009, 2014, 2019 ఎన్నికల్లోనూ గెలిచారు. తాజాగా 2024 ఎంపీ ఎన్నికల్లోనూ ఐదోసారి గెలుపొంది, 20 ఏండ్లుగా పాత బస్తీలో తనకు తిరుగులేదని నిరూపించారు. కాగా, గత రెండు దశాబ్దాలుగా అసదుద్దీన్ ఒవైసీకి లక్షకు తగ్గకుండా మెజార్టీ రావడం గమనార్హం.

2004లో 1,00,145 (37.39%) మెజార్టీ, 2009-లో 1,13,865 (42.14%), 2014లో 2,02,454 (52.94%), 2019లో 2,82,187(58.9%) మెజార్టీ వచ్చింది. తాజాగా మంగళవారం ప్రకటించిన 2024- ఎంపీ ఎన్నికల్లో అత్యధికంగా 3,38,087 (61.8%) మెజార్టీతో ఆయన ఘటన విజయం సాధించారు. 

44 ఏండ్లుగా పట్టుకోసం బీజేపీ ప్రయత్నం..

పాతబస్తీపై పట్టుకోసం బీజేపీ గత 44 ఏండ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. అయితే, ఆ పార్టీ రెండో స్థానానికే పరిమితమవుతోంది. ఈసారి ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున మహిళా అభ్యర్థి మాధవీలత అసదుద్దీన్‌‌‌‌‌‌‌‌కు గట్టి పోటీ ఇచ్చారు. అయితే, కౌటింగ్‌‌‌‌‌‌‌‌ ముగిసే సమయానికి ఆమె రెండో స్థానానికే పరిమితమయ్యారు.