వ్యక్తిని చంపి.. శవాన్ని సూట్ కేసులో పెట్టి రోడ్డుపక్కన పడేసిన మైనర్లు

మద్యం మత్తులో బహిరంగంగా చర్చించుకోవడంతో వెలుగులోకి వచ్చిన మర్డర్

హైదరాబాద్ రాజేంద్రనగర్ లో కలకలం

హైదరాబాద్: ఇద్దరు మైనర్లు ఓ వ్యక్తిని చంపి డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి రోడ్డు పక్కన పడేశారు. చేసిన మర్డర్ గురించి మద్యం మత్తులో బహిరంగంగా చర్చించుకోవడంతో ఉదంతం వెలుగులోకి వచ్చింది. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన ఘటన కలకలం రేపింది. హత్య చేసిన మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

రాజేంద్ర నగర్ లో డైరీ ఫారం పిల్లర్ నెంబర్ 222 వద్ద రోడ్డుపక్కన సూట్ కేసు పడి ఉండడం కలకలం రేపింది. బాంబులు ఉంటాయోమనన్న అనుమానం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ముందు జాగ్రత్త చర్యలతో సూట్ కేసును తెరవగా శవం బయటపడింది. హంతకులు తాగిన మత్తులో చర్చించుకోవడంతో విషయం బయటకు పొక్కి పోలీసుల దృష్టికి వెళ్లింది. మృతుడు చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రియాజ్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. మృతుని పై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు ఉన్నట్లు సమాచారం. చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో రియాజ్ మిస్సింగ్ కేసు నమోదు అయి ఉంది. రియాజ్ ను హత్య చేసిన ఇద్దరు వ్యక్తులు కూడా మైనర్లుగా పోలీసులు గుర్తించారు. రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్,  సీఐ సురేష్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Latest Updates