వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవక్కర్లేదింక..: ఈటెల

పెద్దపల్లి జిల్లా:  వైద్యం కోసం పేదలు కన్నీళ్లు పెట్టొద్దని, ఆస్తులు, ఆడబిడ్డల పసుపు తాడులు అమ్ముకోవాల్సిన అవసరం లేదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య, విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఈ రోజు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి  ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మనుషుల జీవితాలను పట్టించుకున్న ప్రభుత్వాలు దేశంలో ఏవీ లేవని ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే వారిని పట్టించుకుందని అన్నారు. సీఎం కేసీఆర్ పటిష్టంగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దుతున్నారని, ప్రజల జీవన విధానానికి కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారని మంత్రి అన్నారు.

ప్రైవేట్ హాస్పిటల్ లో ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయో అలాగే ప్రభుత్వ ఆసుపత్రులను కూడా కార్పొరేట్ తరహాలో ఆధునీకరిస్తామని ఈటెల తెలిపారు.

రానున్న రెండు మూడు నెలల్లో సీఎం చెప్పినట్లు 40వేల కోట్లతో మిషన్ భగీరథ పనులను పూర్తి చేసి ప్రతి ఇంటి ఆడ బిడ్డ కాళ్ళను గోదావరి నీటితో కడుగుతామని మంత్రి అన్నారు. కరీంనగర్ జిల్లా నీళ్ల జంక్షన్ గా మారనుందని, కాళేశ్వరం నీటితో రెండు పంటలు జిల్లాలో పండించుకోవచ్చని అన్నారు. మొదటగా పెద్దపల్లి జిల్లాకు నీళ్లందిన తరువాతనే ఇతర జిల్లాకు వెళ్తాయన్నారు. మన నీళ్లు మెదక్ జిల్లాకు తరలిస్తున్నారని కొందరు కుంచితత్వ మనసుతో ఆలోచిస్తున్నారని, ప్రభుత్వ ఆలోచన మాత్రం కరీంనగర్, మెదక్,నల్లగొండ, మహబూబ్ నగర్ అన్ని జిల్లాల రైతాంగానికి నీరందించాలన్నదే ఉద్దేశ్యమని ఈటెల అన్నారు.

Latest Updates