
జనగామ జిల్లా: తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి గొల్లపల్లిలో పుట్టడం మన అదృష్టమని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శ్రీకాంతాచారి గుర్తుగా గొల్లపల్లిలోని డబుల్ బెడ్రూం ఇళ్లకు ఆయన పేరు పెట్టడం జరిగిందన్నారు. జిల్లాలోని దేవరుప్పుల మండలం గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ఎర్రబెల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రత్యేక రాష్ట్రం కోసం తన ప్రాణాలను అర్పించిన శ్రీకాంతా చారిని గుర్తు పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమాన్ని తీవ్రతరం చేశారన్నారు.
నేడు గొల్లపల్లిలో ఒక కోటి యాభై లక్షల తొంభై ఆరు వేల వ్యయంతో ఇరవై నాలుగు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల ప్రారంభం జరిగిందని మంత్రి అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించిందని అన్నారు. కల్యాణ లక్ష్మి కోసం లక్ష రూపాయలు, ప్రసూతి సమయంలో కేసీఆర్ కిట్టు, రైతులకు 24 గంటల ఉచిత కరెంట్.. నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అన్నారు. మహిళలకు 3 లక్షల రూపాయలతో వడ్డీ లేని రుణం అందించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
.