వదంతులు నమ్మొద్దు.. కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా ఎలాంటి నిర్దారణ కాలేదని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందొద్దని అన్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ అన్ని విషయాలు పర్యవేక్షిస్తుందని ఆయన అన్నారు. బుధవారం కరోనా వైరస్‌పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. కేంద్ర బృందం హైదరాబాద్‌లోని ప్రభుత్వాసుపత్రులను పరిశీలిస్తోందని మంత్రి ఈటల పేర్కొన్నారు.

కరోనా వైరస్ వ్యాపించకుండా రాష్ట్రం తగు జాగ్రత్తలు తీసుకుంటుందా లేదా అని  కేంద్రం నుంచి ముగ్గురితో కూడిన వైద్య నిపుణుల బృందం పరిశీలించేందుకు పట్టణానికి వచ్చిందని, ఈ బృందం గాంధీ, ఫీవర్, ఛాతీ ఆస్పత్రులను సందర్శించారని ఈటల తెలిపారు. బుధవారం దీనికి సంబంధించి వివరాలు వైద్య బృందం వెల్లడి చేస్తుందని తెలిపారు. గాంధీ, ప్రభుత్వ ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేటెడ్ వార్డులను ఏర్పాటు చేయించామని తెలిపారు. చైనా నుంచి వారిని, అదేవిధంగా కరోనా వైరస్ అనుమానిత లక్షణాలతో వచ్చే రోగులను ఈ వార్డులలో ఉంచి చికిత్స అందిస్తారని తెలిపారు.

Latest Updates