తాలు, తేమ అని రైతుల్ని గోస పెట్టొద్దు

కాళేశ్వరం నీళ్లతో భూమికి బరువయ్యే పంట పండిందని, ఇంత పెద్ద ఎత్తున పంట వచ్చిన సందర్భంలో రైతు కష్టం దళారుల పాలు కావద్దని ప్రభుత్వమే పంట‌ను కొనుగోలు చేస్తుందని చెప్పారు మంత్రి ఈటల రాజేందర్. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్ళు మొదట ముద్దాడిన జిల్లా కరీంనగర్ జిల్లా అని చెప్పారు. తెలంగాణ వచ్చిన తరువాత కాకతీయ కాలువ బాగు చేశామ‌ని, 2500 క్యుసెక్‌లు పారే దగ్గర 5000 క్యూసెక్ నీళ్ళు అందించిన చరిత్ర త‌మ‌ద‌న్నారు. ఏప్రిల్ 16 వరకు నీళ్ళు ఇవ్వ‌డంతో.. వరి, మక్క పంట‌లు బాగా పండాయ‌న్నారు.

ప్రతి ఊరిలో ఐకేపీ సెంటర్ ద్వారా పంట‌ను కొనుగోలు చేస్తున్నామ‌ని, ప్రతి సెంటర్ కి ఒక ఆఫీసర్ ని ,ఇంఛార్జి గా నియమించాలని కలెక్టర్ ని కోరామ‌న్నారు. తాలు ఉందని, తేమ ఉందని రైతును గోస పెట్టొద్ద‌ని అధికారుల‌కు సూచించారు. ఈ స‌మ‌యంలో రైతులు కూడా ఓపికతో త‌మ‌కు సహకరించాలని, ఏవైనా సమస్యలుంటే త‌మ దృష్టికి తీసుకురావాల‌న్నారు

దుష్ట కరోనా శక్తి దూరంగా ఉండాలని మంత్రి ప్ర‌జ‌ల‌కు సూచించారు. అమెరికా లాంటి దేశాలు కొంత నిర్లక్షం చేస్తేనే ఎంత నష్టం జరిగిందో అంద‌రికి తెలుసని, కాబ‌ట్టి ప్రజలు అర్దం చేసుకొని లాక్ డౌన్ గౌరవించాల‌న్నారు. ప్రపంచంలో లాగా శవాల గుట్టలు పడే పరిస్థితి మన దగ్గర తీసుకురావద్దని అన్నారు. ఎవ‌రింట్లో వారు జాగ్రత్తగా ఉండాల‌ని, అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బయటికి రావ‌ద్ద‌ని చెప్పారు. బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడ ముఖానికి అడ్డుగా.. మాస్క్ నే పెట్టుకోవాలని లేదని, తువ్వాలు, కొంగు, దస్తి ఏదైనా వాడొచ్చ‌న్నారు..

అనంత‌రం హుజురాబాద్ నియోజకవర్గ కేంద్రంలో జర్నలిస్టులు, ఆటో డ్రైవర్లు, మున్సిపల్ కార్మికులు, ఆశ వర్కర్స్ కి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఈటల రాజేందర్.

Latest Updates