
హైదరాబాద్, వెలుగు: ‘‘స్వైన్‌ఫ్లూ కంటే, కరోనా వైరస్ డేంజరేమీ కాదు. స్వైన్‌ఫ్లూ కేసుల్లో 10% డెత్స్ ఉంటే, కరోనాలో 4 శాతమే ఉన్నాయి. కరోనా కొత్త వైరస్ కావడం, మెడిసిన్ లేకపోవడం వల్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు”అని మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. బుధవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్‌లో కరోనా వైరస్ ప్రిపేర్డ్‌నెస్, మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు, డాక్టర్లతో మంత్రి సమీక్షించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం గైడ్‌లైన్స్ ప్రకారం గాంధీ, ఫీవర్, చెస్ట్ హాస్పిటల్స్‌లో కరోనా ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామని, ఈ వార్డుల్లో మూడు షిఫ్ట్‌ల్లో సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. కేంద్రం కిట్లు ఇస్తే, ఇక్కడే కరోనా వైరస్ టెస్టులు చేయిస్తామన్నారు. చైనా, వుహాన్‌లో తెలుగు స్టూడెంట్ల బాగోగులపై కేంద్రంతో మాట్లాడుతున్నామని చెప్పారు. సస్పెక్టెడ్ కేసుల సంఖ్య పెరిగితే గాంధీ హాస్పిటల్‌లోని ఓ ఫ్లోర్‌లో స్పెషల్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేస్తామన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన హెల్త్ టీమ్ సూచనల మేరకు, ఐసోలేషన్ వార్డుల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. కాగా, కరోనా వైరస్ ప్రిపేర్డ్‌నెస్, సెంట్రల్ హెల్త్ మినిస్ర్టీ ఇచ్చే గైడ్‌లైన్స్ అమలు కోసం ప్రివెంటీవ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ్‌కుమార్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించారు.
మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేసినం
కరోనా వైరస్ ఇక్కడి వేడి వాతావరణంలో బతికే అవకాశం లేదని, ఈ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల అన్నారు. అయితే, ప్రజలు వ్యక్తిగత శుభ్రత పాటించాలని, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు కర్చీఫ్ వాడాలని, జనాల్లో తిరుగుతున్నప్పుడు మాస్క్‌లు ధరించాలని సూచించారు. మీడియా, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వైరస్ విస్తరణపై అపోహలు సృష్టించొద్దని విజ్ఞప్తి చేశారు. కోటిన్నర మంది వచ్చే మేడారం జాతరకు ఆరోగ్యశాఖ తరఫున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. లేబర్ రూమ్ సహా 50 బెడ్లతో హాస్పిటల్, 20కి పైగా హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశామన్నారు. 102, 104, 108 అంబులెన్స్‌లతో పాటు బైక్ అంబులెన్స్‌లను ఏర్పాటు చేశామన్నారు. 6 జిల్లాల మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్లు, వందకు పైగా డాక్టర్లు, ఐదొందల మంది సిబ్బందిని జాతర కోసం కేటాయించామని, అవసరమైన మెడిసిన్ కూడా పంపించామని చెప్పారు. జాతరకు వచ్చే భక్తులు శుభ్రత పాటించాలని కోరారు.
వాళ్ల శాంపిల్స్ మళ్లీ పంపండి
కరోనా వైరస్ ప్రిపేర్డ్‌నెస్‌పై స్టేట్ హెల్త్ ఆఫీసర్లతో సెంట్రల్ హెల్త్ ఆఫీసర్లు బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే టెస్టులు చేసిన ఇద్దరి శాంపిళ్లను మరోసారి పూణే ల్యాబ్‌కు పంపాలని ఆదేశించారు. ఇప్పటివరకు పది మంది కరోనా లక్షణాలతో ఫీవర్ హాస్పిటల్‌లో చేరారు. ఇద్దరికి టెస్టులు చేపించగా నెగెటివ్‌గా తేలింది. ఇంకో ఐదుగురి శాంపిళ్ల రిజల్ట్స్ గురువారం వచ్చే అవకాశముంది. రిజల్ట్ నెగటివ్‌గా వచ్చిన ఇద్దరితోపాటు కరోనా లక్షణాలు లేని ముగ్గురిని ఇంటికి పంపించారు. మిగతా ఐదుగురిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఇకపై ప్రతి ఒక్కరికీ రెండుసార్లు టెస్టులు చేయించాలని సెంట్రల్ అధికారులు సూచించారు. తొలిసారి టెస్ట్ రిజల్ట్ నెగెటివ్‌గా వచ్చిన రెండ్రోజుల తర్వాత మరోసారి సాంపిల్స్ సేకరించాలన్నారు. చైనా నుంచి వచ్చి జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఉన్న వ్యక్తులను 28 రోజులు క్వారంటైన్‌లో ఉంచాలని ఆదేశించారు.
ముగిసిన సెంట్రల్ టీమ్ పర్యటన
రాష్ట్రంలో కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చేసిన ఏర్పాట్లను కేంద్ర వైద్య బృందం రెండో రోజు పరిశీలించింది. గాంధీలో రెండు ఐసోలేషన్ వార్డులను తనిఖీ చేసింది. శాంపిల్స్ సేకరణ, మాస్క్ లు ధరించటం, అనుమానిత లక్షణాలున్న వ్యక్తులను అంబులెన్స్‌లో తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడి సిబ్బందికి వివరించింది. ఏర్పాట్లపై కేంద్ర బృందం సంతృప్తి వ్యక్తం చేసిందని గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ తెలిపారు. అవసరమైన ఎక్విప్ మెంట్, వెంటిలేటర్ల అవసరాన్ని కేంద్ర బృందం దృష్టికి తెచ్చామని చెప్పారు.